రవాణా రంగ కార్మికుల కోసం సామాజిక సంక్షేమ చట్టం చేయాలి

Feb 22,2024 19:44

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రవాణా రంగ కార్మికుల కోసం సామాజిక సంక్షేమ చట్టం చేయాలని ఆలిండియా ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అర్‌.లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు.గురువారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఏర్పాటు చేసిన ఆటో రవాణా రంగ సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో పది కోట్ల మంది రవాణా రంగ కార్మికులు ఉన్నారని తెలిపారు. ఈ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారమూ లేదన్నారు. 2006లో మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా యుపిఎ1 ప్రభుత్వంలో వామపక్షాల సహకారంతో సంక్షేమ బోర్డుకు స్టాండింగ్‌ కమిటీ ముందు ప్రతిపాదన ఉంచామని, 3వేల పేజీలతో రిపోర్టు కూడా తయారు చేశారని, దాన్ని బిజెపి ప్రభుత్వం పూర్తిగా బుట్ట దాఖలు చేసిందని తెలిపారు. ఏడాదికి 5లక్షల కోట్ల రూపాయలు రవాణా రంగం ద్వారా ఆదాయం వస్తుందని, అందులో 6 శాతం నిధులు కేటాయించి, డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్‌ల నుంచి నెలకు వంద రూపాయలు వసూలు చేస్తే ఏడాదికి రూ.54వేల కోట్లతో సంక్షేమ బోర్డును నడపవచ్చని అన్నారు. ఈ విషయం బిజెపి ప్రభుత్వానికి, రవాణాశాఖ మంత్రి కి తెలియజేసినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డు ద్వారా ప్రమాద బీమా సౌకర్యంతో పాటు ఇన్సూరెన్స్‌ , రుణ సహాయం, పిల్లలకు స్కాలర్షిప్‌లు , పెన్షన్‌ తదితర సౌకర్యాలు కల్పించవచ్చన్నారు. ఇది ప్రభుత్వ బిక్ష కాదని, ఆటో, రవాణా రంగ కార్మికుల హక్కు అని దీన్ని సాధించుకునేందుకు పోరాటం తప్ప మరో మార్గం లేదని అన్నారు. 2019 మోటార్‌ వాహన చట్టంలో అగ్రి గ్రేటర్స్‌ను రవాణా రంగంలోకి ఆహ్వానించాలని ప్రతిపాదించారని, అందులో భాగంగానే పోర్టల్‌ , రాపిడో, ఓ బర్‌, ఓలా, బ్లూ వంటి బహుళ జాతి సంస్థలు రవాణా రంగంలోకి వచ్చాయన్నారు. వారి ప్రయోజనం కోసమే ఫీజులు, పెనాల్టీలు, ఈ చలానాలు పెంచడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలకు అదనంగా 10శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించి ఓనర్‌ కం డ్రైవర్ల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2024లో రవాణ రంగ కార్మికులు కు గొప్ప బహుమతి ఇచ్చిందన్నారు. ఎటువంటి ప్రమాదం జరిగినా 5ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధించే కొత్త చట్టం తీసుకొచ్చిందని అన్నారు. దీనివల్ల డ్రైవర్లు అందరూ రోడ్లమీద కాకుండా, జైల్లో ఉండాల్సిందేనని, ఈ పాపంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు భాగస్వాములేనని తెలిపారు. తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేయనున్నా మని తెలిపారు. ఆటో యూనియన్‌ నాయకుల లక్ష్మణ దొర అధ్యక్షతన జరిగిన సదస్సులో సిఐటియు నాయకులు ఎ.జగన్మోహన్‌, రెడ్డి శంకర్రావు, బి. రమణ, ఆటో యూనియన్‌ నాయకులు రామునాయుడు, శ్రీను, రామారావు, భాస్కరరావు మూర్తి, పైడిరాజు, ఈశ్వరరావు, నారాయణరావు, కార్మికులు పాల్గొన్నారు.

➡️