యాజమాన్యం మూల్యం చెల్లించక తప్పదు

Mar 12,2024 20:56

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించ కపోతే యాజమాన్యం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి. రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్‌ హెచ్చరించారు. స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసన శిబిరం మంగళవారం 41వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరాన్ని సందర్శించిన నాయకులు మాట్లాడుతూ మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు జనవరి నెల జీతాలు, డిఎ బకాయిల, వేతన ఒప్పందం చేయాలని నిరశన సమ్మె చేస్తుంటే యాజమాన్యం పట్టించుకోకుండా ప్రభుత్వం, పెద్దల అండతో వీల్లేమి చేస్తారు అని నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, కార్మికులు ఓర్పు, సహనంతో ఉన్నారని వారందరికీ ఆకలి మంటలు రగిలితే ఆ మంటల్లో మిమ్స్‌ యాజమాన్యం మాడి మసై పోతుందని హెచ్చరించారు. 11వ తేదీ నాటికి జనవరి నెల జీతాలు వేస్తారని మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తారని ఎమ్మెల్యే చెప్పినా సరే మిమ్స్‌ యాజమాన్యం బేఖాతరు చేసిందన్నారు. పని చేసినా కాలానికి మూడు నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం, ప్రజ ప్రతినిధులు స్పందించి మిమ్స్‌ యాజమాన్యం పై ఒత్తిడి తీసుకు వచ్చి న్యాయమైన సమస్యలు పరిష్కరించి జనవరి నెల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ శిబిరంలో ఉద్యోగులు ఎం.నారాయణ, గౌరి, మూర్తి, అప్పలనాయుడు, వరలక్ష్మి, బంగారు నాయుడు, ఎం.రాంబాబు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

➡️