మోడీ ప్రభుత్వం నవయవంచన

Jan 27,2024 00:24

గుంటూరులో ప్రదర్శన

నరసరావుపేటలో ప్రదర్శన
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, దొడ్డిదారిన చట్టాలు అమలు చేయాలని ప్రయత్నిస్తూ నవయవంచనకు పూనుకుందని రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి చుట్టుగుంట సెంటర్‌ వరకూ భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిన్నాటవర్‌, మార్కెట్‌, జిటి రోడ్డు మీదుగా చుట్టుగుంట వరకూ జాతీయ జెండా, ప్రజా సంఘాల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగంలో పొందపరిచిన లౌకిక, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వినుకొండ రోడ్డులోని సిఐటియు కార్యాలయం వద్ద నుండి ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన చేశారు. మల్లమ్మ సెంటర్‌ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. ప్రదర్శన ప్రారంభానికి ముందు సిఐటియు కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య ఆయా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో సభకు ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్‌ అధ్యక్షత వహించగా నరసనావుపేటలో ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సభకు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు అధ్యక్షత వహించారు. ఆయా సభల్లో కె.వి.వి.ప్రసాద్‌, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం జరగలేదని, రైతులను జీపుతో తొక్కించి చంపిన కేంద్ర మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోకపోవడంతో దేశంలో చట్టాలు బతికే ఉన్నాయా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోందని అన్నారు. పైగా రద్దు చేసిన నల్ల చట్టాలనే దొడ్డి దారిన వివిధ రూపాల్లో అమలు చేయటానికి పార్లమెంట్‌లో పలు బిల్లులు ఆమోదిస్తోందని విమర్శించారు. వ్యవసాయ, పారిశ్రామిక, రవాణా ఖనిజ సకల సంపదలను అంబానీ, అదాని తదితర కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతుందన్నారు. అందుకు అడ్డుగా ఉన్న చట్టాలను అడ్డగోలుగా మారుస్తుందని, ప్రశ్నించిన వారిపై కేసులు, వేధింపులు సాగిస్తుందన్నారు. ప్రజాతంత్ర హక్కులను, రాష్ట్రాలు హక్కులను హరిస్తుందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందన్నారు. దేశంలో 70 కోట్ల మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారని, వ్యవసాయ నల్ల చట్టాలు అమలైతే రైతులు తమ భూములను కోల్పోయి. సొంత పొలాల్లోనే కూలీలుగా మారతారని చెప్పారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మోడీ పాలనలో అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరగా పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులు అప్పులు పాలై సుమారు లక్షా 50 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. పోరాటాల ఫలితంగా పేదలకు పంపిణీ చేసిన భూములను తిరిగి కార్పొరేట్లకు అప్పగించేందుకు భూ హక్కుల చట్టాల్లో మార్పులు చేస్తుందని విమర్శించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, ఎఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మికులు హక్కులు హరించే విధంగా నాలుగు లేబర్‌ కోడులు తీసుకువచ్చి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి కార్మికులను రోడ్డు మీద పడేశారన్నారు.విశాఖ ఉక్కు, రైల్వే, ఎల్‌ఐసి లాంటి ఆదాయం వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించి, స్మార్ట్‌ మీటర్ల బిగింపు నిలుపుదల చేయాలన్నారు. తెలుగు రైతు సంఘం జిల్లా నాయకులు కళ్లం రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ భూ హక్కుల చట్టం 22 ఉపసంహరించుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు నిర్వాసితులకు పూర్తి, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కరువు, తుఫాను నష్టపరిహారం, ఇన్పుట్‌ సభ్యులను వెంటనే ఇవ్వాలన్నారు. అందరికీ పంటల బీమా కల్పించాలన్నారు. స్వామినాథన్‌ కమిషనర్‌ సిఫార్సుల ప్రకారం మద్దతుల చట్టం చేయాలని కోరారు. కౌలు రైతులకు నష్టపరిహారాలు, బీమా సౌకర్యం ఇవ్వాలన్నారు.కార్యక్రమంలో కిసాన్‌ ఫెడరేషన్‌ నాయకులు కె.శ్రీధర్‌రావు, ఏరువాక రైతు కూలీ సంఘం నాయకులు పి.కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఇ.అప్పారావు, భారత్‌ బచావో నాయకులు నవజ్యోతి, సీనియర్‌ వ్యవసాయ రిటైర్డ్‌ శాస్త్రవేత్త ఎన్‌.వేణుగోపాలరావు, కార్మిక సంఘ నాయకులు హనుమంతరావు, అరుణ్‌ కుమార్‌, కె.శ్రీనివాస్‌, బి.ముత్యాలరావు, రైతు సంఘం నాయకులు కె.రంగారెడ్డి, డాక్టర్‌ కొల్లా రాజ్‌మోహన్‌రావు, నళినీకాంత్‌, మాల్యాద్రి పాల్గొన్నారు. నరసరావుపేట సభలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌, టిడిపి నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామారావు మాట్లాడారు. కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టకపోతే రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయే ప్రమాదం, ఆహార సంక్షోభం ఏర్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్‌ సిలార్‌ మసూద్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.హనుమంత్‌ రెడ్డి, ఎస్‌.ఆంజనేయ నాయక్‌, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, సిపిఎం నాయకులు ఎమ్‌డి హుస్సేన్‌, రబ్బాని, పిడిఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు, ఎన్‌.రామారావు, ఎఐటియుసి నాయకులు కె.రాంబాబు, వి.వెంకట్‌, యు.రంగయ్య, రాజు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు కె.సాయికుమార్‌, ఆంజనేయరాజు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ : కుంచనపల్లి ప్రాతూరు క్రాస్‌ రోడ్డు వద్ద ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ ఎఐకెఎస్‌ జెండాను ఊపి ప్రారంభించారు. ప్రదర్శనలో కార్మికులు, రైతులు తమ వాహనాలకు ఎఐకెఎస్‌, సిఐటియు, ఎఐటియుసి జెండాలు కట్టుకొని పాల్గొన్నారు. కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెడ, చిర్రావూరు, మెల్లెంపూడి, ఇప్పటం వడ్డేశ్వరం, కొలనుకొండ, తాడేపల్లి తదితర గ్రామాల్లో ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎం.సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంకాయలపాటి శివనాగ రాణి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు, సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడారు. ఒకవైపున పెట్రోల్‌ డీజిల్‌, గ్యాస్‌, ధరలను విపరీతంగా పెంచి ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. రైతుల, వ్యవసాయ కార్మికుల, అసంఘటిత కార్మికుల హక్కులను మోడీ కాలరాశారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి కేంద్ర బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఉపాధి కూలీలకు ఏడాదిలో 200 పని దినాలు, రోజు కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ మస్టర్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. తుపాను నష్టపరిహారాలను, ఇన్పుట్‌ సబ్సిడీలను రైతులకు వెంటనే ఇవ్వాలని, రైతులందరికీ పంటల బీమా కల్పించాలని డిమాండ్‌ చేశారు. సాగులో ఉన్న కౌలు రైతులకే, నష్టపరిహారాలు బీమా వర్తింపజేయాలన్నారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించి, స్మార్ట్‌ మీటర్ల బిగించే విధానాన్ని నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పి.బాలకృష్ణ, ఎన్‌.భారతి, ఎం.సుహాస్‌, జి.సాంబిరెడ్డి, వెంకటయ్య, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.వెంకటేశ్వరరావు, డి.వెంకటరెడ్డి, ఎ.రంగారావు, డి.రాజేంద్రబాబు, గోపాల్‌రావు, కె.ఈశ్వరరెడ్డి, ఎస్‌.కె ఎర్రపీరు, డి.విజయభాస్కరరెడ్డి, కె.వెంకటయ్య, ఆర్‌వి.రాఘవయ్య, వై.బర్నబాస్‌, టి.బక్కిరెడ్డి పాల్గొన్నారు.

➡️