మోడీ ద్రోహం.. వైసిపి, టిడిపిలకూ భాగం

Feb 7,2024 22:32 #cpm dharna, #New Delhi

వీరికి ప్రజలే బుద్ధి చెబుతారు

ప్రత్యేక హౌదా కోసం ఢిల్లీలో జరిగిన ధర్నాలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం ద్రోహం చేసిందని, రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపిలకు దీనిలో భాగం ఉందనిసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వీరికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ప్రత్యేక హౌదా, విభజన హామీల అమలు కోసం సాగిస్తున్న పోరాటం, ఆంధ్రుల హక్కులు, ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. హౌదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం నాడిక్కడ ఏపి భవన్‌ వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గన్నారు. ఏపికి అన్యాయం చేసిన ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం డౌన్‌ డౌన్‌ అన్న నినాదాలతో ధర్నా స్థలి మార్మోగిపోయింది. ప్లకార్డులు పట్టుకుని పిడికిళ్లు బిగించి మోడీకి వ్యతిరేకంగా నినదించారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రానికి పూర్తి మెజార్టీ ఉందని, అందుకే ప్రత్యేక హౌదా అడగలేకపోతున్నామని అనడానికి జగన్మోహన్‌ రెడ్డికి సిగ్గుండాలని అన్నారు. రాజ్యసభలో బిజెపికి పూర్తి మెజార్టీ లేదని, వైసిపి మద్దతుతోనే రాజ్యసభలో పది బిల్లులు ఆమోదం పొందాయని అన్నారు. వ్యవసాయ చట్టాల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్ని సందర్భాల్లో బిజెపికి వైసిపి మద్దతు ఇచ్చిందని విమర్శించారు. ప్రత్యేక హౌదా ఇవ్వకపోతే బిల్లులకు, రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వమని ఈ ఐదేళ్లలో ఏనాడైనా అన్నారా? ప్రశ్నించారు. తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని, బిజెపికి బానిసలుగా మారారని దుయ్యబట్టారు. గతంలో ధర్మ పోరాట దీక్షలు చేసిన టిడిపి నేత చంద్రబాబు ఇప్పుడు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాను ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసులు కోసమా? రాజకీయ పొత్తుల కోసమా?అని ఆయన ప్రశ్నించారు. ఐదు కోట్ల మంది ప్రజలు బిజెపిని, బిజెపికి మద్దతు ఇచ్చే పార్టీలను నిలదీసి, ఇంటి దారిపట్టిస్తేనే ప్రత్యేక హౌదా వస్తుందని, విశాఖ ఉక్కు నిలబడుతుందని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకఅష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ప్రత్యేక హౌదా కోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడేళ్లుగా, అమరావతి రాజధాని కోసం నాలుగేళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయని, అయినా, కేంద్ర ప్రభుత్వం తీరు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఏపి ప్రజల నెత్తిపై ప్రధాని మోడీ పెద్ద బండరాయితో కొట్టారని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రత్యేక హౌదా హామీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.. ప్రత్యేక హౌదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం ఢిల్లీ గడ్డపై పోరాటం చేశామని అన్నారు. ఈ పోరాటం ఏ ఒక్కరి కోసమో చేయటం లేదని, రాష్ట్ర భావితరాల కోసం, యువత కోసం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి మొదటి నుంచి వామపక్షాలు అండగా ఉన్నాయని అన్నారు. మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఏపికి కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు. పన్నులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, బుల్లెట్‌ ట్రైన్‌, పరిశ్రమలు వంటివన్నీ గుజరాత్‌ కే ఇస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆకాంక్షలను నెరవేర్చని బిజెపితో పొత్తు పెట్టుకున్న వారిని చిత్తుగా ఓడిస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి నిజాయితీ ఏమైనా మిగిలి ఉంటే, విశాఖ ఉక్కు, ప్రత్యేక హౌదా ఉద్యమంలో పాల్గనాలని అన్నారు. ప్రత్యేక హౌదా ముగిసిన అధ్యయనం అనేవారు ఆంధ్రా ద్రోహులని అన్నారు. ధర్మ పోరాటం చేసిన చంద్రబాబు అధర్మం వైపు ఉండొద్దని అన్నారు. సిబిఐ మాజీ డైరెక్టర్‌ జెడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రామరాజ్యం గురించి చెప్పే బిజెపి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని విమర్శించారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హౌదా ఇవ్వొద్దని 14 ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌.కె సింగ్‌ రాసిన పుస్తకంలో తెలిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. ప్రసన్న, ఎ. అశోక్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాము, ఉపాధ్యక్షులు జయచంద్ర, శివకుమార్‌, ప్రత్యేక హౌదా, విభజన హామీల సాధన సమితి నేత ప్రొఫెసర్‌ సదాశివ రెడ్డి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్లు జె.అయోధ్యరాము, డి.ఆదినారాయణ, ఆప్‌ ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ చార్జ్‌ ముని నాయక్‌, టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ తదితరులు పాల్గన్నారు.

➡️