మైనార్టీల అభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యం

ప్రజాశక్తి-మదనపల్లె మైనార్టీల అభ్యున్నతి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు సాహిల్‌ దాదా గాంధీ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ప్యారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గ నాయకులు ఎస్‌.రెడ్డి సాహెబ్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర ఎంతో ఘనమైందన్నారు. భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్‌ పాత్ర అమోఘమైందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి విధానాలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో పాలన కొనసాగిస్తూ విభజించు పాలించు అనే విధానంతో ముందుకెళ్తున్నారని విమర్శించారు. జిఎస్‌టి రూపంలో ప్రజలు ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి విధానాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. బిజెపి పెద్దలు ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న నోరు మెదపడం లేదన్నారు. బిజెపి పాలన నుండి దేశాన్ని రక్షించేందుకు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర నిర్వహించారన్నారు. పార్లమెంటులో ముస్లిం వ్యతిరేక బిల్లులకు రాష్ట్రంలోని వైసిపి,టిడిపిలు మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. డిసిసి అధ్యక్షులు అల్లా బకాస్‌ మాట్లాడుతూ బిజెపి అంటే బాబు, జగన్‌, పవన్‌ అని, వైసిపి, టిడిపి, జనసేనలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనన్నారు. ఎస్‌.రెడ్డి సాహెబ్‌ మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రంలో అరాచకాల తప్ప అభివద్ధి లేదని విమర్శించారు. కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.కె.బాషా, డిసిసి ఉపాధ్యక్షులు మీనా కుమారి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మన్సూర్‌ అలీ ఖాన్‌, అరిఫుల్లా నాయకులు రాజంపేట సయ్యద్‌, నిమ్మనపల్లి మండల అధ్యక్షులు పఠాన్‌ ముబారక్‌ ఖాన్‌, రూరల్‌ మైనార్టీ అధ్యక్షులు అల్లాబకష్‌, రామసముద్రం మండల అధ్యక్షులు ఖాదర్‌ బాషా, మహబూబ్‌ పీర్‌, మదనపల్లి టౌన్‌ జనరల్‌ సెక్రటరీ మహమ్మద్‌ అలీ, డిస్ట్రిక్ట్‌ సోషల్‌ మీడియా చైర్మన్‌ మహమ్మద్‌ రఫీ, మదనపల్లి పట్టణ మహిళా అధ్యక్షులు ఈశ్వరమ్మ, సయ్యద్‌, సోను,ఖాసీం, బక్షు, దిలీప్‌ పాల్గొన్నారు.

➡️