మేలు చేయడానికే కుల గణన

సామాజిక సాధికార బస్సుయాత్రలో పాల్గొన్న మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు

           అనంతపురం ప్రతినిధి : రాజ్యాంగ ఫలాలు అందుకోవడానికి దూరంగానున్న అన్ని కులాలకు మేలు చేయడానికే వైసిపి ప్రభుత్వం కుల గణనను చేపట్టిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వైసిపి చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర సోమవారం నాడు రాప్తాడులో జరిగింది. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి శంకర నారాయణ, పార్లమెంట్‌ సభ్యులు గోరంట్ల మాధవ్‌, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనార్టీలకు న్యాయం చేస్తున్నది వైసిపి మాత్రమేనని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఈ వర్గాలకు మేలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కులగణను చేపట్టారని వివరించారు. ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగానున్న కులాలకు రాజ్యాధికారం అందివ్వాలన్నదే ఆయన ఉద్ధేశమని చెప్పారు. ఈ నాలుగేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గిందదన్నారు. వైసిపి అధికారంలోకి రాకముందు 16 శాతం పేదరికముండేదని చెప్పారు. అది ఆరు శాతానికి తగ్గించారని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా వంటి చోట్ల వలసలు కూడా ఆగిపోయాయని తెలిపారు. కార్మిక శాఖ మంత్రి జయరాం మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల కోసం నవరత్నాలు పెట్టారని చెప్పారు. ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికీ మేలు జరిగిందన్నారు. కుటుంబానికి మేలు జరగకుంటే తనకు ఓటు కూడా వేయవద్దని చెప్పే ధైర్యం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి ఉందన్నారు. చంద్రబాబునాయుడు అంతా కుట్రలు, కుతంత్రాలేనని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే అది తన ఘనతేనన్నట్టుగా చెప్పుకునే విధంగానున్నారు. చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ మోసపూరిత హామీలను నమ్మొద్దని విమర్శించారు. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్‌ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారుడున్నారు. మామ ఎన్టీఆర్‌కే వెన్నుపొడిచారని విమర్శించారు. రాబోయే రోజుల్లో పవన్‌ కళ్యాణ్‌కు వెన్నుపోటు తప్పదని హెచ్చరించారు. వారి మోసపూరిత మాటలు నమ్మొద్దని హెచ్చరించారు. ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థలు మొదలుకుని అన్ని రాజకీయ పదవుల్లో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు సమ ప్రాధాన్యతను వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కల్పించారని తెలిపారు. ఆయనతోనే సామాజిక సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ నదీమ్‌ అహమ్మద్‌, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️