మృతి చెందిన వారి పేరిట బిల్లులు

ప్రజాశక్తి – సాలూరు : మండలంలో ఉపాధి హామీ చట్టం కింద ఈ ఏడాది జరిగిన పనుల్లో అనేక అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందాల సర్వేల్లో బట్టబయలైంది. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజాభిప్రాయ వేదిక సాక్షిగా 29 గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయని సర్వే బృందాలు చెప్పాయి. డ్వామా పీడీ కె.రామచంద్రరావు సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామాల వారీగా తేలిన అక్రమాల గురించి సామాజిక తనిఖీ సర్వే బృందాల సభ్యులు వివరించారు. మరణించిన వ్యక్తుల పేరిట పనులు చేసినట్లు చూపుతూ బిల్లులు కాజేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మస్తర్లు, వేలిముద్రలు లేకుండా చాలా మందికి బిల్లులు చెల్లించినట్లు స్పష్టమైంది. కొంతమంది పేరిట హాజరు లేకుండానే చెల్లింపులు చేయడం కనిపించింది. పెదపదం పంచాయతీలో కందుల గంగులు అనే మరణించిన వ్యక్తి పేరిట వారం రోజుల పాటు బిల్లు చెల్లించినట్లు రుజువైంది. జీవో 17022 ప్రకారం వాలంటీర్లు పని చేస్తే మూడు రోజుల పాటు చెల్లింపు చేయాల్సి ఉంది. కానీ 8మంది వాలంటీర్లకు ఆరు రోజుల పాటు బిల్లు చెల్లించినట్లు డిఆర్‌పి తెలిపారు. పంచాయతీ పరిధిలో సంతకాలు, వేలిముద్రలు లేకుండా బిల్లులు చెల్లించినట్లు చెప్పారు. పనులకు రాలేదని ఆబ్సెంట్‌ వేసి తర్వాత హాజరైనట్టు రికార్డుల్లో చూపించినట్లు తెలిపారు. చెరువుల పనుల్లోనూ ఎక్కువగా అక్రమాలను గుర్తించారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని పంచాయతీల్లో నూ కనిపించింది. 2018లో చేసిన పనులకు ఇప్పుడు చెల్లింపులు మండలంలోని తుండ పంచాయతీలో 2018లో ఐటిడిఎ ద్వారా చేసిన రెండు మెటల్‌ రోడ్డు పనులకు 2022-23లో బిల్లులు చెల్లింపు చేయడాన్ని సర్వే బృందం గుర్తించింది. రూ.18లక్షల మేర ఈ పనులను తాజాగా చెల్లించినట్లు గుర్తించారు. ఇప్పడు ఆ పనులు పరిశీలించగా బిటి రోడ్లు వేసి వున్నట్లు గుర్తించారు. ఐదేళ్ల క్రితం చేసిన పనులకు ఇప్పుడు చెల్లింపులు చేయడం ప్రశ్నార్థకంగా మారింది. తాజా ఏడాదిలో 29 పంచాయతీల్లో రూ.19 కోట్లు మేర పనులు చేసినట్లు అధికారులు తెలిపారు.కొటియా గ్రామాల్లో చెల్లింపుల్లేవుఆంధ్రా-ఒడిశా వివాదాస్పద కొటియా గ్రామాల్లో గిరిజనులకు రెండు ఆధార్‌ కార్డు లున్న కారణంగా ఉపాధి బిల్లులు చెల్లించలేదని డ్వామా పీడీ రామచంద్రరావు తెలిపారు. ఈ గ్రామాల్లో ఉపాధి చట్టం కింద పనులు చేసిన గిరిజన కూలీలకు రెండు రాష్ట్రాల ఆధార్‌ నెంబర్లు ఉండడంతో చెల్లింపునకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. కార్యక్రమంలో ఎపిడి రమేష్‌రామన్‌, ఎంపిడిఒ జి.పార్వతి, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, ఎపిఒలు రామకృష్ణ, సత్యనారాయణ, ఎస్సార్పీ తిరుపతి రావు పాల్గొన్నారు.

➡️