మిర్చి ధరలు నేల చూపులు

పెదకూరపాడు వద్ద కళ్లాల్లోని మిర్చి గ్రేడింగ్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజుల్లో క్వింటాలుకి రూ.3 వేలనుంచి రూ.5 వేల వరకు తగ్గింది. యార్డుకు రోజుకు సగటున 40 నుంచి 50 వేల టిక్కిలు వస్తున్నాయి. గత నెల 10వ తేదీనుంచి ఈనెల 2వ తేదీ వరకు రాయలసీమ జిల్లాల నుంచి సరుకు రాగా గతనాలుగు రోజులుగా పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి కూడా సరుకు రావడం ప్రారంభం అయింది. సరుకు ఎక్కువగా వస్తుండటంతో వ్యాపారులు ధరలను క్రమంగా తగ్గిస్తున్నారు. గతశుక్రవారం క్వింటాలుకు రూ.3వేలు కనిష్టంగా తగ్గగా గరిష్టంగా రూ.5 వేలు తగ్గింది. ఎగుమతి అవకాశాలు తగ్గడం, పెద్దఎత్తున సరుకు వస్తుండటంతో వ్యాపారులు ధరలను తగ్గించి వేస్తున్నారు. కొంత మంది రైతులను గ్రామాల్లోనే విక్రయించేలా వత్తిడి తెచ్చేందుకు యార్డులోనే ధరలు తగ్గాయన్న భావన కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత మందివ్యాపారులు పల్నాడు జిల్లాలో ఇప్పటికే రైతుల కల్లాల్లోనే కొనుగోలు ప్రారంభించారు. అలాగే యార్డులో ఎక్కువ మంది రైతుల వద్ద తేమ శాతం అధికంగా ఉందని కూడా ధర కొంత తగ్గిస్తున్నారు. ప్రస్తుతం ఎండతీవ్రత ఎక్కువగా లేకపోవడం వల్ల మిర్చి ఆరబెట్టుకునేందుకు ఎక్కువ రోజులు సమయంకేటాయించాల్సి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అయినకాడికి అమ్ముకుంటున్నారు. గుంటూరుకు సమీప ప్రాంతాల వారు మాత్రం ఒకటి రోజులు ఆరబెట్టుకుని యార్డులోనే నిద్రించి సరుకు అమ్మిన తరువాత స్వస్థలాలకు వెళ్తున్నారు.గత ఏడాది ఇదే రోజుల్లో మిర్చి ధరలు గరిష్టంగా రూ.27 వేల నుంచి రూ.30 వేలవరకు పలికిన మిర్చి ప్రస్తుతం ఈ ఏడాది జనవరి ప్రారంభం అయిన తరువాత మేలురకం తేజ,బాడిగ రకాలు కనిష్టంగా రూ.9 వేలు ఉండగా గరిష్టంగా రూ.23 వేలు పలికాయి. 333, నెంబరు 5, 273, 341 తదితర రకాలు ధరలు కనిష్టంగా రూ.9500 పలకగా గరిష్టంగా రూ.21వేలు మాత్రమేపలికాయి. గత నెల రోజుల కాలంలో సరుకు ఎక్కువ వచ్చిన రోజున ధరలు తగ్గించడం, సరుకు తక్కువగా వచ్చిన రోజు సగటు ధర స్వల్పంగా పెంచడం వ్యాపారులకు పరిపాటిగా మారింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఈ పరిస్థితి అత్యంత ఇబ్బంది కరంగా మారింది. గతనెల వరకు రూ.20 వేల పలికిన సీజంట బాడిగ రకం గత మూడు రోజులుగా రూ.15వేల నుంచి రూ.18వేల మధ్య పలుకుతోంది. తేజ వెరయిటీ రూ.25వేల నుంచి రూ.23 వేలకు తగ్గింది. 355 బాడిగ రకం రూ.24 వేల నుంచి రూ.2 వేలు తగ్గి రూ.22 వేల పలుకుతోంది. తేజ మీడియం రూ.20 వేల నుంచి రూ.17 వేలకు, ఆర్మూర్‌ రకం రూ.19 వేల నుంచి రూ.17 వేలకు తగ్గింది. నాన్‌ ఎసి కామన్‌ వెరయిటీల్లో 334 కనిష్ట ధర రూ.10 వేలు, గరిష్ట ధర రూ.23 వేలు పలికింది.కోల్డ్‌ స్టోరేజీలో ్ల నిల్వ చేసిన సరుకు కనిష్ట ధర రూ.11 వేలు, గరిష్ట సగటు ధర రూ.20వేలు వచ్చింది. మేలురకాలు కనిష్ట ధర రూ. 10,500, రూ.21,500 ధర వచ్చాయి. గత వారం రోజులుగా తగ్గుదల కొనసాగుతోంది.

➡️