మిరియాల రైతులకు గిట్టుబాటు ధర

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: మిరియాలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ స్పష్టం చేసారు. సేంద్రీయ పద్దతిలో ఏజెన్సీలో శ్రేష్టమైన నల్ల మిరియాలను గిరిజనులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన రైతుల ఆదాయం పెంచి ఆర్ధికాభివృద్ధికి కృషి చేయాలన్నారు. స్పైసెస్‌ బోర్డు అధికారులుతో కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి శనివారం వర్చువల్‌ విధానంలో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గిరిజన రైతులు అత్యధికంగా వరి, పసుపు, రాజ్మా, అల్లం, చిరుధాన్యాలు, ఉద్యాన వన పంటలు కాఫీ, మిరియాల పంటలను సాగు చేస్తున్నారని చెప్పారు. స్పైసెస్‌ బోర్డును బలోపేతం చేసి, తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. మిరియాలు పండిస్తున్న రైతులకు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో సుమారు రూ.500 కోట్ల విలువైన మిరియాల ఉత్పత్తులు జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకు తగిన స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు. సుగంధ ద్రవ్యాల సాగుకు పెట్టుబడులు పెడితే రైతులకు ఆదాయం పెరిగి, ఆర్ధిక భద్రత పెరుగుతుందని పేర్కొన్నారు. కాఫీ, మిరియాలు క్రయ, విక్రయాలు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి గ్రామ వ్యవసాయ, ఉద్యాన వన సహాయకులకు అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. స్పైసెస్‌ బోర్డు సహాయ సంచాలకలు కులదీప్‌ రారు, విజీష్న మాట్లాడుతూచ ఎస్‌టిడిఎఫ్‌ ప్రాజెక్టులో భాగంగా కాఫీ, మిరియాల రైతులకు ఉపయోగ పడే విధంగా అల్యూమినియం నిచ్చెనలు, మిరియాల నూర్పిడి యంత్రాలు పంపిణీ చేసామన్నారు. గిరిజన రైతులకు 20 వేల మిరియాల మొక్కలు, టార్పాలిన్లు అందజేసామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.బి.ఎస్‌ .నంద్‌, జిల్లా ఉద్యానవన అధికారి ఎ.రమేష్‌ కుమార్‌రావు, స్పైసెస్‌ బోర్డు సీనియర్‌ క్షేత్ర స్థాయి అధికారి బొడ్డు కళ్యాణి, కాఫీ బోర్డు ఉప సంచాలకులు రమేష్‌, స్పైసెస్‌ బోర్డు సహాయ సంచాలకులు విజీష, ఆహార, వ్యవసాయ సంస్థ నేషనల్‌ ప్రాజెక్టు మేనేజర్‌ వినిరు సింగ్‌, డిపిఎం భాస్కరరావు పాల్గొన్నారు.

➡️