మినీ అంగన్‌వాడీ మంజూరు చేయండి

ప్రజాశక్తి- సీతంపేట:  రామానగరం, పెద్దగూడలో చిన్నారులు ఉన్నారని మినీ అంగన్వాడి కేంద్రం మంజూరు చేయాలని ధారపాడు సర్పంచ్‌ జి సుందరమ్మ, సిపిఎం మండల కార్యదర్శి ఏ భాస్కరరావు, గిరిజన సంఘం నాయకులు జి. శ్రీరాములు పిఒ కల్పన కుమారికి సోమవారం స్పందన కార్యక్రమంలో వినతినిచ్చారు. సవర సింగిపురం గ్రామినికి చెందిన రవి వాటర్‌ ట్యాంక్‌ మంజూరు చేయాలని, శ్యామల మ్మ వైయస్సార్‌ కళ్యాణమస్తు పథకం మంజూరు చేయాలని, ఎగువ గోడకి చెందిన కోతమ్మ నాటు కోళ్ల పథకం మంజూరు చేయాలని, కిరపకు చెందిన అనిత జిఎన్‌ఎం కోర్స్‌ చదువుకోవ డానికి ఆర్థిక సహాయం అందించాలని, జానీ గోడకు ఆఫీస్‌ కమ్యూనిటీ హాల్‌ మంజూరు చేయాలని పిఒ దృష్టికి తీసుకొ చ్చారు. జనగాల పాడుకు చెందిన చుక్కయ్య ఆటో లోను మంజూరు చేయాలని, జమ్ముడు గూడకు చెందిన కళ్యాణరావు బీటి రోడ్డు పూర్తి చేయాలని, కుండికి చెందిన రామారావు దుక్కి దున్నే మిషన్‌ మంజూరు చేయాలని, కాశిమాను గూడకు చెందిన బుడ్డయ్య పంట నష్టపరిహారం మంజూరు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ రోషి రెడ్డి, డ్రైవర్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి సింహాచలం, పిఎఒ హరికృష్ణ డిప్యూటీ డిఎంహెచ్‌ఒ కె. విజయ పార్వతి, డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి, సిడిపిఒ పి. రంగలక్ష్మి పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టండి పార్వతీపురం టౌన్‌: జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని జనసేన పార్టీ నాయకులు, ఎన్‌హెచ్‌అర్‌సి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు కోరారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జెసి ఆర్‌.గోవిందరావుని కలిసి జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. జిల్లాలో కొన్ని బ్లాక్‌ స్పాట్ల వద్ద నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అడ్డాపుశీల గ్రామ సమీపంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతానగరం, కొమరాడ తదితర మండలాలతో పాటు పార్వతీపురం పట్టణంలోని బైపాస్‌ రోడ్డు, టౌన్‌ ఫ్లై ఓవర్‌, మెయిన్‌ రోడ్డు, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ జంక్షన్‌, వైకెయం కాలనీ, వెంకంపేట గోళీలు, నర్సిపురం తదితర ప్రాంతాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆయా రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. పూటుగా మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, అధికలోడు, మితమీరిన వేగంతో లారీలు, ఆటోలు తదితర వాహనాలు నడుపుతుండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు వివరించారు. ఆటోలు, లారీలు ద్వారా ప్రమాదాలు జరగకుండా నియంత్రించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న స్థలాల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసి, సంబంధిత శాఖ అధికారుల నిఘా పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించి ప్రజల ప్రాణాలను రక్షించాలని కోరుతూ, వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన జెసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

➡️