మార్పు

Mar 25,2024 04:55 #jeevana, #kadha

నరేంద్ర బస్టాండ్‌లో తన మిత్రుడు కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కడంతా గోలగోలగా ఉంది. అపరిశుభ్రత స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది అక్కడే ఉమ్మటం, మరికొంతమంది అరటి తొక్కలు ఇష్టానుసారంగా వేయటం చూశాడు. అదంతా చూస్తున్న నరేంద్ర ఇక భరించలేకపోయాడు. అరటితొక్కలు, ఖాళీ సిగరెట్టు ప్యాకెట్లు ఇలా తనకి కనిపించిన చెత్తనంతటినీ ఏరి చెత్తబుట్టలో వేశాడు. ఈలోగా తన మిత్రుడు రావాల్సిన బస్‌ వస్తే అక్కడికి వెళ్ళాడు. బస్‌ దిగగానే మిత్రుడిని ఆలింగనం చేసుకున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక ఇంటికి వెళుతూ ‘నరేంద్ర మీ ఊరి బస్టాండ్‌ ఏంటి ఇంత అధ్వానంగా ఉంది?’ అని మిత్రుడు ప్రశ్నించాడు.
‘ఇక్కడ ఇంతే రా… మనం ఎంత శుభ్రం చేసినా మామూలే. ఇందాక నేనే స్వయంగా కింద పడేసిన చెత్తా చెదారం అంతా చెత్త బుట్టలో వేశాను. చెత్త బుట్ట ఎదురుగా కనిపిస్తున్నా దాన్ని ఉపయోగించరు’ అన్నాడు అసహనంగా.
‘అలా అంటే ఎలారా! మనమే అవగాహన కల్పించాలి, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే ఎలాంటి హాని జరుగుతుందో వివరించాలి’ అంటూ బస్టాండ్‌లోని విచారణ కౌంటరు దగ్గరకు వెళ్ళి మైకు తీసుకుని ‘ప్రయాణికులారా… ఈ బస్టాండ్‌ మనది. దయచేసి అరటి తొక్కలు, చెత్త ఎక్కడబడితే అక్కడ వేసి పాడు చేయకండి. చెత్త బుట్టలు ఉపయోగించండి. పరిశుభ్రత పాటించండి. పరిసరాలను అపరిశుభ్రంగా చేయకండి’ అని గట్టిగా చెప్పాడు. అది విని కొంతమంది వ్యక్తులు తమ చుట్టూ ఉన్న చెత్త, చెదారం, అరటి తొక్కలు తీసి చెత్త బుట్టలో వేశారు. అది చూసిన మిత్రుడు, ‘చూశావా నరేంద్ర, పరిసరాల పరిశుభ్రత మనం పాటించడమే కాక, ఇతరులకూ అవగాహన కల్పించినప్పుడే పర్యావరణం సంరక్షించినట్లు. అర్థమైందా?’ అని చెబుతూ ఒకరి భుజంపై మరొకరు చేయి వేసుకుని ఇంటికి వెళ్లారు.

-కనుమ ఎల్లారెడ్డి,
ఆస్టిన్‌, అమెరికా, 93915 23027.

➡️