మామిడి కొమ్మా..పూత ఏదమ్మా

మల్లెపూలతో సింగారించినట్లుగా పచ్చన మామిడి చెట్లు పూతతో కళకళలాడుతూ కనిపించాల్సిన కాలమిది. రకాలు..చెట్ల వయసు ఆధారంగా నవంబరు నుంచి డిసెంబరు నెలాఖరు వరకు పూత పట్టాలి. జనవరిలో గుత్తులుగా విరగ్గా యాలి. ఇంత వరకూ జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితి కనరావడం లేదు. దీని ప్రభావం మామిడి దిగుబడిపై పడనుంది. మామిడి కొమ్మకు ఏమైందో..మధుర ఫలం దక్కుతుందో లేదోనని ఇటు రైతుల్లో.. అటు వ్యాపారుల్లో గుబులు రేగుతోంది. ప్రజాశక్తి-రాయచోటి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున మామిడి తోటల పెంపకం ఎక్కువగా ఉంది. ఎంతో ఆశగా వేలాది ఎకరాలలో మామిడి తోట సాగు చేస్తున్న రైతాంగానికి నాలుగేళ్లుగా పంట దిగుబడి లేక ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో 2020 నుండి 2022 చివరి వరకు దాదాపు రెండేళ్ల పాటు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రైతులు డీలాపడ్డారు. ఈ ఏడాదన్నా రైతులు మామిడి పంట ఆశించిన స్థాయిలో నేటికీ కూడా మామిడి పూత కనపడకుండా పోవడం రైతుల పాలిట శాపంగా మారింది. చాలా ప్రాంతాల్లో మామిడి తోటలో చెట్లకు తెగులు, నల్ల మంగుతో పాటు పూత కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఫిబ్రవరి నెలకు భారీగా తోటలన్నీ పూతలతో కలకలాడాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. అయితే నేడు పూత కనపడకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. ఇక్కడి నుండి చెన్నరు, ముంబయి, బెంగళూరు, హైదరాబాదు తదితర ప్రాంతాలకు మామిడి కాయలను ఎగుమతి చేస్తారు. గతంలో మామిడి పంటను కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇచ్చి వారి తోటలను ముందస్తుగానే కొనుగోలు చేసేవారు. కానీ నేడు పూత కనపడకపోడం కొనుగోలుదారులు కూడా ఎవరు ఉత్సాహం చూపలేదు. మామిడి రైతులు దిగాలిపడ్డారు. చెట్లకు మందు కొట్టేందుకు అయ్యే కూలీలు ఖర్చులు కూడా అధికమయ్యాయి. పెనుబారంగా ఈసారి మామిడి కాపు మారింది. ఏది ఏమైనప్పటికీ అనుకున్నంత స్థాయిలో మామిడి పంట అన్నమయ్య జిల్లాలో మామిడి పూత రాకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.35,867 హెక్టార్లలో మామిడి సాగు జిల్లా వ్యాప్తంగా 35,863 హెక్టార్లలో మామిడి పంటను రైతులు సాగు చేశారు. రైల్వేకోడూర్‌లో 3,687 హెక్టార్లు, టి.సుండుపల్లెలో 3,036, చిన్నమండెంలో 2,500, లక్కిరెడ్డిపల్లిలో 2,400, వీరబల్లిలో 2,105, కంభంవారిపల్లెలో 1,850, చిట్వేలిలో 1,760, గుర్రంకొండలో 1,658, రామాపురంలో 1,433, పీలేరులో 1,400, కలకడలో 1,378, పెనగలూరులో 1,352, సంబేపల్లిలో 1,230, వాల్మీకిపురంలో 1,150, కలికిరిలో 1,090, గాలివీడులో 9,020, రాయచోటిలో 890, నిమ్మనపల్లిలో 820, పెద్దమండ్యంలో 784, నందలూరులో 712, ఓబులవారిపల్లిలో 650, రామసముద్రంలో 600, మదనపల్లిలో 690, రాజంపేటలో 374, కురబలకోటలో 300, తంబళ్లపల్లెలో 300, బి.కొత్తకోటలో 286, మొలకలచెరువులో 250, పెద్దతిప్పసముద్రంలో 217, పుల్లంపేటలో 196 హెక్టార్లలో మామిడి పంటను రైతులు సాగు చేశారు.అధికంగా ఖర్చవుతోంది మామిడి పంట సాగు చేయాలంటే అధిక ఖర్చు వస్తుంది. మామిడి చెట్లకు దుక్కి, నీరు కట్టడం, ఎరువులకు అధికంగా ఖర్చవుతోంది. కూలీలు కూడా ఎక్కువయ్యాయి. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. జనవరి, ఫిబ్రవరి మాసంలోని వ్యాపారస్తులు మామిడి తోటలు కొనేవారు. ఈసారి ఫిబ్రవరి నెల వచ్చినా కూడా వ్యాపారస్తులు తోటవైపు రావడం లేదు. ప్రభుత్వం స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలి.- సుబ్బారెడ్డి రైతు, పెద్దకాలవపల్లి, రాయచోటి.రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి జిల్లాలో మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మామిడి చెట్టుకు పూత అరకొరగా ఉన్నా ఆ పూత కూడా రాలిపోవడం రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. మామిడి సాగు చేసిన రైతులను గుర్తించి నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలి. – సిరిపురి రామచంద్ర, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, రాయచోటి ఈ ఏడాది పూత తక్కువ వాతావరణం మార్పిడి వలన ఈ ఏడాది పూత తక్కువగా వచ్చింది. వర్షాలు కూడా తక్కువగానే పడ్డాయి. జిల్లాలో మామిడి పంటకు 20 శాతం మాత్రమే పూత వచ్చింది. 10, 15 రోజులు వరకు 35 శాతం పుత వచ్చే అవకాశం ఉంది. మిల్టి స్ప్రే చేయాలి.1 లీటర్‌కు 10 గ్రాములు వేయాలి. వచ్చిన పూతను నిలుపుకోవాలి. ఈ సారి పూత తక్కువగా వచ్చే అవకాశం ఉంది.- పి.రవి చంద్రబాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, రాయచోటి.

➡️