మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి

‘ధీర’ పుస్తకాన్ని విద్యార్థులతో కలిసి ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపాల్‌ శంకరయ్య, డాక్టర్‌ ఉషారాణి, సావిత్రి తదితరులు

        అనంతపురం కలెక్టరేట్‌ : సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమాన హక్కులు సాధించుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని డాక్టర్‌ ఉషారాణి పిలుపునిచ్చారు. మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నాడు అనంతపురం నగరంలోని కెఎస్‌ఎన్‌ డిగ్రీ మహిళా కళాశాలలో సెమినార్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్‌ ఉషారాణి హాజరై మాట్లాడారు. సమాజంలో మహిళ పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ, ఆప్యాయత, కరుణ, వంటివి మహిళల సొంతం అన్నారు. మహిళలు ధైర్యంతో ముందుకు సాగితే అగ్రస్థానం వారిదే ఉంటుందన్నారు. వ్యవస్థలో మహిళ ఒక భాగం కావాలన్నారు. అభద్రతా భావాలను తొలగించుకోవాలన్నారు. జీవిత ఆశయాన్ని తెలుసుకుని మనుగడ సాధించాలన్నారు. విశిష్ట అతిథి కెఎస్‌ఎన్‌ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ శంకరయ్య మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని తెలిపారు. మహిళ శక్తి గొప్పదన్నారు. హక్కుల కోసం పోరాడుతూనే బాధ్యతలను నెరవేర్చాలన్నారు. అప్పుడే అగ్రస్థానంలో నిలుస్తారన్నారు. సమానత్వం కోసం ఇలాంటి సెమినార్‌లు నిర్వహించుకునే పరిస్థితుల నుంచి సమాజమే గౌరవించే రోజులను సాధించుకోవాలన్నారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడుతూ ఎందరో మహిళా త్యాగధనుల ప్రాణార్పణలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడిందన్నారు. సమానత్వం, వివక్ష రూపుమాపడం, 8 గంటల పని దినాలు, ఓటు హక్కు, ప్రసూతి సెలవులు వంటి వాటి సాధనకు నాడు వీర మహిళలు ప్రాణాలు అర్పించి సమాన హక్కులు సాధించారని కొనియాడారు. వారి వారసత్వాన్ని కొనసాగించి భవిష్యత్‌ తరాలకు మహిళా ప్రాధాన్యతను చాటి చెప్పాలన్నారు. హక్కుల కోసం పోరాడే దినంగా, త్యాగధనలను స్మరించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. వారి త్యాగాలను భవిష్యత్‌ తరాలకు చాటి చెప్పేలా మహిళలు అభివృద్ధి సాధించి గౌరవింపబడాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రూపొందించిన ‘ధీర’ పుస్తకాన్ని ప్రిన్సిపల్‌ శంకరయ్య చేతుల మీదుగా విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్యామల, రాజేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజినమ్మ, అరుణమ్మ, ప్రజానాట్య మండలి క్రిష్ణవేణి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రాం కన్వీనర్‌ పాతిమా బేగం, పర్వీన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఉమెన్‌ కన్వీనింగ్‌ కన్వీనర్‌ రజిత, జిల్లా ఉపాధ్యక్షులు సిద్దూ, గిరి, నగర నాయకులు సోము, గణేష్‌, బాలరాజు, రాధా పాల్గొన్నారు.

➡️