మళ్లీ ఎగిసిన ధరలు5.55 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

Dec 12,2023 21:05 #Business

న్యూఢిల్లీ : దేశంలో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుత ఏడాది నవంబర్‌లో వినియోగదారుల రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.55 శాతానికి ఎగిసిందని మంగళవారం కేంద్ర గణంకాల శాఖ కార్యాలయం ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ఇంతక్రితం అక్టోబర్‌లో సిపిఐ 4.87 శాతంగా నమోదయ్యింది. గడిచిన నవంబర్‌లో గ్రామీణ ద్రవ్యోల్బణం 5.85 శాతానికి పెరిగింది. ఇది అక్టోబర్‌లో 5.12 శాతంగా ఉంది. ఇదే సమయంలో అహార ద్రవ్యోల్బణం 6.61 శాతంగా ఉండగా.. గడిచిన నెలలో ఏకంగా 8.70 శాతానికి ఎగిసింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీని 2-6 శాతం మధ్యన కొనసాగేలా ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యస్థ కాలానికి 4 శాతానికి కట్టడి చేయాలని నిర్దేశించుకుంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 5.4 శాతంగా ఉండొచ్చని ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షాలో అంచనా వేసింది. పెరిగిన పారిశ్రామికోత్పత్తిప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) 11.7 శాతానికి పెరిగి.. 16 మాసాల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ముఖ్యంగా తయారీ రంగం, గనులు, విద్యుత్‌ రంగాలు మెరుగైన వృద్థిని కనబర్చాయని కేంద్ర గణంకాల శాఖ పేర్కొంది. ఇంతక్రితం మాసం ఆగస్ట్‌లో ఐఐపి 10.3 శాతంగా చోటు చేసుకుంది. అక్టోబర్‌లో తయారీ రంగం 10.4 శాతం, గనుల రంగం 13.1 శాతం, విద్యుత్‌ 20.4 శాతం చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.

➡️