మనసున్న మహారాజు బలరామరాజు

Dec 1,2023 21:01

గ్రామాభివృద్ధిలో ఆయన కృషి అమోఘం
ప్రజాశక్తి – కాళ్ల
సమాజంలో ధనవంతులు ఉంటారు. అందులో మనసున్న మహారాజులే అసలైన శ్రీమంతులుగా పేరొందుతారు. సొంత గ్రామం అభివృద్ధి కోసం తనకున్నంతలో భూములను దానంగా ఇవ్వడంతో పాటు గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించిన మాజీ సర్పంచచి గోకరాజు బలరామరాజు మనసున్న మారాజు.సొంత ఊరు అభివృద్ధికి కృషి చేసి గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. గ్రామ సర్పంచిగా పదవి ఏకగ్రీవంగా పలు దఫాలు వెతుక్కుంటూ వచ్చి వరించడం అరుదుగా ఉంటుంది. కాళ్ల మండలంలోని జువ్వలపాలెం గ్రామానికి చెందిన గోకరాజు కుటుంబానికి ఘనమైన చరిత్ర ఉంది. గ్రామ సర్పంచిగా అందరివాడు, అజాత శత్రువుగా వెలుగొందారు. 18 ఏళ్ల పాటు గ్రామ సర్పంచి జీవితంలో ఆయన ఆద్యంతం వివాద రహితుడిగానే మెలిగారు.కుటుంబ నేపథ్యంతాతల కాలం నాటి నుంచి భూస్వాముల కుటుంబం. జువ్వలపాలెంలోని ఆ కుటుంబంలో 1934లో గోకరాజు బలరామరాజు జన్మించారు. గోకరాజు రంగరాజు, బుల్లి అచ్చాయమ్మ దంపతులకు బలరామరాజు మూడో కుమారుడు. తల్లిదండ్రులు ఆర్థిక స్థితిమంతులు కావడంతో ప్రజలకు ఆర్థికంగా సాయం అందించారు.1959లో పంచాయతీగా ఏర్పాటుజువ్వలపాలెం ఒకప్పుడు ఏలూరుపాడు గ్రామ పంచాయతీలో ఉండేది. 1959లో జువ్వలపాలెం గ్రామపంచాయతీగా ఏర్పడింది. 1959 నుంచి 2013 వరకు 40 ఏళ్ల పాటు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఆయన హయాంలో పంచాయతీ కార్యాలయం నిర్మించారు. పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కలేదుబలరామరాజు సర్పంచిగా ఉన్న సమయంలో గ్రామ ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు ఏనాడు వెళ్లిన దాఖలాలు లేవు. ఎన్నికలు వస్తే అన్ని తరగతులవారిని పిలిపించి మాట్లాడి సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించేవారు. గ్రామస్తులు ఏకతాటిగా ఉంటూ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. ఏలూరుపాడు నుంచి విడిపోయిన పరిస్థితుల్లో జువ్వలపాలెం మైనర్‌ పంచాయతీగా ఉండేది. సమీపంలో ఉన్న మేజర్‌ పంచాయతీలతో పోలిస్తే ఆదాయం బాగానే ఉంది. జువ్వలపాలెం మైనర్‌ గ్రామపంచాయతీ ఆదాయం అంతంత మాత్రమే. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు అనేక అవస్థలు పడాల్సి వచ్చేది. బలరామరాజు సర్పంచిగా ఉనప్పుడు పంచాయతీ వార్షికాదాయం రూ.ఆరు వేలు ఉండేది. సమిష్టిగా కృషి చేస్తే దాన్ని రూ.70 వేలకు చేర్చగలిగారు. మౌలిక వసతుల కల్పనకు కృషిజువ్వలపాలెంలో ఒకప్పుడు రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, డ్రెయినేజీ సమస్యలు ఉండేవి. జువ్వలపాలెం ముద్దుబిడ్డ గోకరాజు బలరామరాజు అదే స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి బాటలు వేస్తూ పేదలకు బాసటగా నిలిచారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు బలరామరాజు కృషి అమోఘం. ఎస్‌సి పేట, గరువుపేట ప్రాంతాల్లో 26 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాటిలో సుమారు 200 ఇళ్ల నిర్మించగలిగారు. పంచాయతీ కార్యాలయం, పశువుల ఆసుపత్రి భవనం, ఫుట్‌పాత్‌, సంత మార్కెట్‌, ఉప్పరగూడెం చెరువు తవ్వకం వంటి పనులు చేయించారు. గ్రామంలో ప్రతి స్థలాన్ని సేకరించి ఆదాయ వనరులుగా మార్చారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం బలరామరాజు నిరంతరం పని చేశారు. బలరామరాజు సర్పంచిగా పని చేస్తున్న కాలంలో గ్రామంలో అభివృద్ధి నిధులు లేవు. గ్రామ పంచాయతీ ఆదాయం చాలా తక్కువ. అయినా నిరుత్సాహపడుకుండా కేంద్ర, రాష్ట్ర సమితి, జిల్లా పరిషత్‌ ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు చేసేందుకు ప్రయత్నించి గ్రామంలోని సామాన్య జనం, దళిత, బిసి తరగతులకు అన్ని రకాలుగా సహాయం అందించారు.ఆలయ నిర్మాణంకాళ్లకూరులో శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని గోకరాజు బలరామరాజు, సరస్వతి దంపతుల ఆర్థిక సహకారంతో 1980లో నిర్మించారు.18 ఏళ్ల పాటు గ్రామ సర్పంచిగా సేవలు1970 నుంచి 1988 వరకు సర్పంచిగా పలు దఫాలు ఏకగ్రీవంగా పని చేశారు. గ్రామ సర్పంచిగా వరుసగా 18 ఏళ్ల పాటు తనదైన శైలిలో గ్రామ రాజకీయాలను శాసించిన బలరామరాజు గ్రామాభివృద్ధికి బాటలు వేశారు. గ్రామస్తుల ఆదరణ, కలుపుగొలుతనం, నాయకత్వ నిపుణతతో గ్రామ సర్పంచి పదవిని పలు పర్యాయాలు ఏకగ్రీవంగా దక్కించుకున్న ఘనత ఆయనదే. గ్రామంలో పేద తరగతులకు ఏ కష్టం వచ్చినా బలరామరాజు ఆపద్బాంధవుడుగా ఉండేవారు. గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిధులను తీసుకొచ్చి సర్పంచిగా 18 ఏళ్ల పాటు జువ్వలపాలెం పల్లె ప్రగతికి విశేష కృషి చేశారు.గోకరాజు బలరామరాజు నగర్‌1981లో గోకరాజు బలరామరాజు నగర్‌ను ఏర్పాటు చేశారు. 1982లో బలరామరాజు సర్పంచి హయాంలో ఎస్‌సి పేటలో 13.70 ఎకరాల భూమిని ఇల్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క లబ్ధిదారునికి మూడు సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు అందించారు. ఇళ్ల స్థలాల మట్టి పూడిక పనులు చేయించి కేటాయించారు. పూరి గుడిసెలు నిర్మించేందుకు 92 మంది లబ్ధిదారులకు గుమ్మాలు అందించారు.శాశ్వత గృహ నిర్మాణ సముదాయంజువ్వలపాలెంలో శాశ్వత గృహ నిర్మాణ సముదాయాన్ని 1984లో 52 బంగాళ పెంకుటిల్లులు నిర్మించారు. సర్పంచి గోకరాజు బలరామరాజు హయాంలో మొదటి బంగాళ పెంకిటిల్లు గాతల ఏలియ్య ఇంటిని 1984లో అప్పటి జిల్లా కలెక్టర్‌ ఎస్‌.లక్ష్మీనారాయణ ప్రారంభించారు. పేదలు ఇళ్లు కట్టుకోవడానికి తన వంతు సహకారం అందించారు. గ్రామంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. మట్టి, గ్రావెల్‌, మెటల్‌ రోడ్లు నిర్మించారు. ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించారు. ఇల్లు కట్టుకున్న ప్రతి పేదవాడికి ఆర్థిక సహకారం అందించడంతో ఆ ప్రాంత ప్రజలు గోకరాజు బలరామరాజు నగర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ కాలనీకి బలరామరాజు నగర్‌ పేరు పెట్టుకోవడం విశేషం. ప్రస్తుతం ఆ నగర్‌లో పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మాణాలు జరిగి చూడచక్కని ప్రాంతంగా మారింది.సిబిసిఎన్‌సి చర్చికి స్థలం విరాళం, ఆర్థిక సాయం2012లో సిబిసిఎన్‌సి చర్చి నిర్మాణానికి 62 సెంట్ల భూమిని విరాళంగా అందించారు. గోకరాజు రంగరాజు కుమారులు గోకరాజు కృష్ణమూర్తిరాజు, గోకరాజు రామలింగరాజు, గోకరాజు బలరామరాజు వారి కుమారుడు గోకరాజు రంగరాజు (రంగబాబు), వారి కుమారుడు గోకరాజు వెంకట బలరామకృష్ణంరాజు (వంశీ) సహాయ సహకారాలు అందించారు. స్థలం ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం రూ.లక్ష అందించారు.నేడు జువ్వలపాలెంలో సంస్మరణ సభజువ్వలపాలెం గ్రామంలో గోకరాజు బలరామరాజు సంస్మరణ సభ ఈ నెల రెండో తేదీ శనివారం నిర్వహిస్తున్నామని గోకరాజు వెంకట బలరామ కృష్ణంరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు రానున్నారు. బలరామరాజు జువ్వలపాలెం గ్రామానికి 18 ఏళ్ల పాటు సర్పంచిగా విశిష్ట సేవలందిం చారన్నారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని సంస్మరణ సభ నిర్వహిస్తామన్నారు. గ్రామస్తులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

➡️