మద్దతు ధరకు తడిసిన ధాన్యం కొనాలి : రైతుసంఘం

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

మిచౌంగ్‌ తుపాన్‌ వల్ల జరిగిన పంట నష్టాల నమోదులో 35శాతంపైగా జరిగిన నష్టాలనే నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ విమర్శించారు. సోమవారం ఏలూరు రూరల్‌ మండలంలోని లింగారావుగూడెంలో తుపాన్‌ వల్ల నేలకొరిగిన వరి పంటలను రైతుసంఘం నాయకులు పరిశీలించారు. మొలకలొచ్చిన వరి కంకులతో నినాదాలు చేస్తూ రైతులు, కౌలు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ తుపాన్‌ వల్ల అన్నదాతలకు అపార నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాల నమోదుకు, తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం తగదన్నారు. పంట ఏ మేరకు నష్టం జరిగినా నష్టం నమోదు చేసి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎకరాకు వరికి రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. పంట నష్టాల నమోదులో ఈ క్రాప్‌తో నిమిత్తం లేకుండా వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల పేర్లను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించాలన్నారు. పంటల బీమా పథకం వర్తింపజేయడం కోరారు. తడిసిన, రంగుమారిన, మొలకొచ్చిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతులను, కౌలు రైతులను సమీకరించి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఎలికే డేవిడ్‌రాజు, మారుమూడి పౌలు, మారుమూడి సుధాకర్‌, నూలు ఆంజనేయులు, కాటి గంగారావు, కాటి కృష్ణ, కె.అర్జయ్య, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️