మత్స్యకారుల కోసమే ‘సాగర్‌ పరిక్రమ’

మత్స్యకారుల సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల తీరును పరిశీలించేందుకే 'సాగర్‌ పరిక్రమ'

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పర్షోత్తమ్‌ రూపాలా

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, ఎచ్చెర్ల

మత్స్యకారుల సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల తీరును పరిశీలించేందుకే ‘సాగర్‌ పరిక్రమ’ యాత్ర చేపట్టామని కేంద్ర మత్స్య, పశు సంవర్థకశాఖ మంత్రి పర్షోత్తమ్‌ రూపాలా అన్నారు. సాగర్‌ పరిక్రమ యాత్ర వందో రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ప్రతిపాదిత పిషింగ్‌ హార్బర్‌ ప్రాంతంలో నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి అనేక పధకాలను అమలు చేస్తోందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు మత్స్యకారులకు రూ.3,768 కోట్లను ఖర్చు చేస్తే మోడీ ప్రధాని అయిన తర్వాత తొమ్మిదన్న ఏళ్లలో రూ.37 వేల కోట్లు వెచ్చించామని చెప్పారు. అందులో ఒక్క ఎపి కోసం రూ.3,900 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మత్స ్యకారులకు ఏడు శాతం వడ్డీతో రుణాలు అందిస్తు న్నామని, సకాలంలో రుణాలు చెల్లించిన వారికి కేంద్ర ప్రభుత్వం అందులో మూడు శాతం భరిస్తోందని చెప్పారు. గతంలో రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇచ్చే వారని, ఇప్పుడు మత్స్యకారులకు సైతం ఆ కార్డులు అందిస్తున్నామని న్నారు. కేంద్ర మత్స్య, పశుసంవర్థకశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ మాట్లాడుతూ సాగర్‌ పరిక్రమ పేరుతో ఒక కేంద్ర మంత్రి దేశ వ్యాప్తంగా 7 వేల కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టడం ఇదే తొలిసారి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు వివిధ పథకాల కింద మంజూరైన పరికరాలకు, రుణాలకు సంబంధించిన చెక్‌లను కేంద్ర మంత్రి పర్షోత్తమ్‌ రూపాలా అందించారు. మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ బోటు, వల, ఇంజిన్‌ కలిపి రూ.5 లక్షలతో అందిస్తున్న యూనిట్‌ను అంశాల వారిగా విడదీసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంతో పాటు వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు-మంచినీళ్ల పేటలోనూ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు పనులు 30 నుంచి 40 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మూడు నెలల్లో డ్రెడ్జింగ్‌ పనులూ పూర్తవుతాయని చెప్పారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ మాట్లాడుతూ సముద్ర తీరం ఎక్కువ ఉన్న జిల్లాలో దేశంలోనే జిల్లా ఐదో స్థానంలో ఉందన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం పరంగా తమ వంతు కృష్టి చేస్తున్నామని చెప్పారు. సమస్యలు చెప్పుకున్న పలువురు మత్స్యకారులుకేంద్ర మంత్రి పర్షోత్తమ్‌ రూపాలాకు పలువురు మత్యకారులు తమ సమస్యలను చెప్పుకున్నారు. నరసన్నపేట మండలం కంబకాయకు చెందిన పాపారావు మాట్లాడుతూ ఇక్కడ చేపల వేట సక్రమంగా సాగకపోవడంతో గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ చిన్న స్థాయి జెట్టీలు నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాడు. తమకు వల, బోటు, ఇంజిన్‌ కలిపి రూ.5 లక్షలు యూనిట్‌గా అందిస్తున్నారని, దానివల్ల తమకు ఉపయోగం ఉండటం లేదంటూ డి.మత్స్యలేశంకు చెందిన లక్ష్మణరావు చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ జి.వి.ఎల్‌.నరసింహారావు, కేంద్ర మత్స్య, పశుసంవర్థకశాఖ జాయింట్‌ సెక్రటరీ నీతూ ప్రసాద్‌, రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్థక అడిషనల్‌ డైరెక్టర్‌ లాల్‌ అహ్మద్‌, ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌, ఎంపిపి ఎం.చిరంజీవిరావు, జెడ్‌పిటిసి హేమమాలినిరెడ్డి, ఎంపిటిసి బల్లాడ జనార్థనరెడ్డి, బుడగట్లపాలెం సర్పంచ్‌ రాంబాబు, విజయనగరం బిజెపి అధ్యక్షుడు ఎన్‌.ఈశ్వరరావు పాల్గొన్నారు.

➡️