మండుతున్న సూరీడు..!

ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరి
ఉపశమనాల వైపు జనం పరుగులు
తల్లడిల్లుతున్న చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు
సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికం
త్వరలో 40 డిగ్రీలకు చేరువయ్యే అవకాశం
ప్రజాశక్తి – భీమవరం
వాతావరణం వేడెక్కుతోంది. వేసవి ప్రారంభంలోనే సూరీడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ తీవ్రత, ఉక్కబోతతో జిల్లా ప్రజానీకం అల్లాడుతోంది. దీంతో జనం ఉపశమనం వైపు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తల్లడిల్లుతున్నారు. రోజురోజుకీ ఎండతీవ్రత పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజుల్లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడం జనాలను ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 15 రోజులుగా వాతావరణం రాత్రి మంచు, పగలు వేడిమిగా ఉంది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతోపాటు పొగమంచు కురవడంతో పగటి ఉష్ణోగ్రతలు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. వాస్తవానికి ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండల ప్రభావం కన్పించింది. దాదాపు వారం రోజులపాటు పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. జిల్లాలో 33 నుంచి 35 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఉత్తర భారతదేశంపై వెస్టర్న్‌ డిస్టర్బెన్స్‌ (పశ్చిమ ఆటంకాల) ప్రభావం కొనసాగుతోంది. సాధారణంగా ఈ సమయంలో ఇవి ఉత్తర భారతదేశంపైనే కొనసాగుతాయి. అయితే ఇప్పుడు దక్షిణ భారతదేశంవైపు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ వైపు కదులుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఉదయం, రాత్రి వేళల్లో కొద్దిసేపు మేఘాలు ఆవరించి చల్లదనం ఏర్పడినా.. మధ్యాహ్నం మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రతకు జనం రోడ్లపైకి వచ్చేందుకు వెనుకాడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎండ తీవ్రతకు ఉక్కబోత తోడవ్వడంతో జనం తల్లడిల్లుతున్నారు. దీనికితోడు విద్యుత్‌ కోతలు అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజానీకం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. శీతల పానీయాల వైపు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా వివిధ రకాల పండ్ల జ్యూసులతోపాటు, ఐస్‌క్రీమ్స్‌, కూల్‌డ్రింకులు తాగేందుకు మక్కువ చూపుతున్నారు.గత నెలలోనే రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు సాధారణంగా మే నెల వస్తేనేగాని ఎండల తీవ్రత అంతగా కన్పించేది కాదు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండాయి. పసిఫిక్‌ మహా సముద్రంలో గతేడాది ప్రారంభమైన ఎల్‌నినో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో గరిష్ట స్థాయికి చేరింది. దీనిని వాతావరణ నిపుణులు సూపర్‌ ఎల్‌నినోగా పేర్కొంటున్నారు. ఎల్‌నినో కారణంగానే 2023 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. ఎల్‌నినో కొనసాగుతున్నందున ఈ ఏడాది జనవరితోపాటు ఫిబ్రవరిలో కూడా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1991-2020 మధ్య నమోదైన ఉష్ణోగ్రతల సగటును పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో 0.81 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. దీంతో ఫిబ్రవరిలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు యూరప్‌లోని కోపర్నికస్‌ క్లైమేట్‌ చేంజ్‌ సర్వీస్‌ తెలిపింది. గతంలో 2015 చివరిలో పసిఫిక్‌ సముద్రంలో సూపర్‌ ఎల్‌నినో ఏర్పడటంతో 2016 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది.40 డిగ్రీలకు చేరే అవకాశం ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు బలహీన పడటంతో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావం కన్పిస్తోంది. కొన్నిచోట్ల సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 33 నుంచి 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. మరికొద్ది రోజుల్లో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి ఆరంభంలోనే ఈ పరిస్థితి తలెత్తడం అసాధారణమేనని వీరు చెబుతున్నారు. అయితే కొద్దిరోజులపాటు జిల్లాలో ఉష్ణతాపం, ఉక్కపోతతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

➡️