మండుతున్న ఎండలు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం ప్రాంతంలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. ఎండ తీవ్రత గంట గంటకు పెరుగుతోంది. మధ్యాహ్న సమయంలో నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి రెండవ వారం నుంచే ఎండలు మండుతున్నాయి. మంగళవారం యర్రగొండపాలెంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మాణుష్యంగా రోడ్లు ..ఎండల వేడిమి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, రోడ్లు నిర్మాణుష్యంగా మారుతున్నాయి. మరోవైపు రెక్కాడితేకానీ డొక్కాడని దినసరి కార్మికులు, రిక్షాకార్మికులు, రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులను అమ్ముకొని జీవించే చిరువ్యాపారులు విలవిలలాడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదు.దీంతో ఎలా బతుకాలో కూడా తెలియడం లేదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్‌లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ాహనదారులు, ప్రయాణికులు, కూలీలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వేడిమిని తట్టుకునేందుకు అవస్థలు పడుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి..ఎండల అధికంగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరి అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బకు గురైతే వాంతులు, విరేచనాలతో పాటు తలనొప్పి, శరీరంలో ఉష్ణ్రోగ్రతలు పెరిగి ప్రాణహాని కలిగే అవకాశాలుంటాయని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు, వద్ధులు, రోగులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తప్పనిసరి బయటకు రావలసి వస్తే తలకు రుమాలు, టోపీ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని, శీతలపానీలను, పండ్ల రసాలను, మజ్జిగను అధికంగా తీసుకోవాలని సూచించారు. మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలని, పలుచని వస్త్రాలను ధరించాలని, కాళ్లు చేతులు, ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఎండ దెబ్బ తగిలినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.

➡️