భూ సేకరణ నోటిఫికేషన్‌ రద్దుకు కసరత్తు!

Feb 29,2024 23:17

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని గ్రామాల్లో 2016లో భూ సేకరణ ద్వారా తీసుకున్న భూముల్లో కొంత మందికి తిరిగి ఇప్పించేందుకు అప్పటి నోటిఫికేషన్‌ ఉపసంహరణ జిల్లా యంత్రాంగం, సిఆర్‌డిఎ కసరత్తు చేస్తున్నాయి. 2015 జనవరిలో 26 రెవెన్యూ గ్రామాల్లో 25,398 మంది రైతుల నుంచి 34,281 ఎకరాలను సిఆర్‌డిఎ భూ సమీకరణ ద్వారా రాజధాని నిర్మాణం కోసం తీసుకున్నారు. పలు గ్రామాల్లో భూములు ఇవ్వని వారి నుంచి భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు 2016లో నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం 4300 ఎకరాల భూమిని సేకరణ ద్వారా తీసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయగా కేవలం 191.82 ఎకరాలనే సేకరణలో తీసుకున్నారు. భూ సేకరణ ద్వారా కూడా భూములు స్వాధీనం చేసుకోలేకపోవడం వల్ల సీడ్‌ యాక్సిస్‌తో పాటు పలు ప్రధాన రహదారుల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయాయి. అయితే ఆ తరువాత 2019లో ప్రభుత్వం మారిపోవడంతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. అయితే ఈ నోటిఫకేషన్‌ జారీ రద్దు చేయాలని నాలుగున్నరేళ్లుగా ఆలోచనలో ఉన్నా ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని సిఆర్‌డిఎ అధికారులు రండు నెలలుగా అంశంపై దృష్టిపెట్టారు. ఈ నోటిఫికేషన్‌ ఉపసంహరించుకుంటే మాస్టర్‌ ప్లాన్‌ విచ్చిన్నం అవుతుందని భూ సమీకరణలో భూములిచ్చిన రైతులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల షెడ్యూలు వచ్చేలోగా ఈ భూములను రైతులకు అప్పగించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో భూ సమీకరణలో భూములు ఇవ్వని రైతుల నుంచి 2016 జనవరిలో అప్పటి ప్రభుత్వం 4300 ఎకరాల భూములను సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటీఫికేషన్‌కు వ్యతిరేకంగా కొంతమంది రైతులు ఆందోళన నిర్వహించారు. కొంతమంది కోర్టుకు వెళ్లారు. భూసమీకరణలో మొత్తం 34 వేల ఎకరాలను తీసుకోగా ఈ భూముల మధ్యలో 4300 ఎకరాలకు చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు సేకరణకు నిరాకరించారు. స్వాధీనం చేసుకున్న భూములతోపాటు సమీకరణలో ఉన్న భూములతో కలిపి కొన్ని గ్రామాల్లో రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్‌లను కేటాయించింది. కొన్ని చోట్ల ఈ భూముల్లోనే నిర్మాణాలను కూడా చేపట్టింది. అయితే వైసిపి అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకున్న గ్రామాల్లో రైతులకు తిరిగి భూములు అప్పగిస్తామని సిఎం జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు కొన్ని నెలలుగా రైతులకు సంబంధిత భూములు ఇవ్వాలని అధికారులపై ప్రభుత్వం వత్తిడి పెంచింది. ఈ మేరకు అధికారులు భూసేకరణలో తీసుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో అధికారులు ప్రయత్నిస్తున్నారు. సిఆర్‌డిఎ అధికారులతో జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి సమీక్షలు చేస్తున్నారు. నోటిఫికేషన్‌ రద్దుకు సంబంధించిన పూర్వప రాలను సేకరిస్తున్నారు. సిఆర్‌డిఎ అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవడంతో సంబంధిత డిప్యూటీ కలెక్లర్ల పనితీరుపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.

➡️