భారత ఇంధన రంగంలోకి 67 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు: మోడీ

Feb 6,2024 21:15 #Business

గోవా: వచ్చే 5-6 ఏళ్లలో భారత ఇంధన రంగంలోకి 67 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత ఇంధనరంగ వఅద్ధిలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించినట్లు చెప్పారు. భారత ఇంధన వారోత్సవాలను మంగళవారం ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థికవ్యవస్థ 7.5 శాతం వార్షిక వఅద్ధి రేటుతో దూసుకెళ్తోందని మోదీ అన్నారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఇంధన రంగంలో భారత్‌ పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. 2045 నాటికి దేశ ఇంధన అవసరాలు రెట్టింపవుతాయన్నారు. ప్రపంచంలో భారత్‌ మూడో అతిపెద్ద ముడిచమురు, ఎల్‌పీజీ వినియోగదారు అని గుర్తుచేశారు. అలాగే ఎల్‌ఎన్‌జీ వినియోగంలో నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ.. భారత్‌ మాత్రం దాన్ని సమర్థంగా ఎదుర్కోగలిగిందని మోదీ అన్నారు. పైగా గత రెండేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని తగ్గించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల దేశీయ సహజవాయువు ఉత్పత్తి పెరుగుతోందన్నారు. భారత ఇంధన వినియోగంలో గ్యాస్‌ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుతామన్నారు. గత పదేళ్లలో పెట్రోల్‌లో ఇథేనాల్‌ వాటాను 1.5 నుంచి 12 శాతానికి పెంచామన్నారు. 2025 నాటికి దాన్ని 20 శాతానికి చేర్చుతామని తెలిపారు. ప్రపంచ ఉద్గారాల్లో భారత్‌ వాటా నాలుగు శాతమేనని గుర్తుచేశారు. 2070 నాటికి శూన్య ఉద్గారాల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు గుర్తు చేశారు. ఇటీవల ప్రకటించిన సూర్యోదయ యోజనలో భాగంగా ఇళ్లల్లో అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని ప్రకటించారు.

➡️