భళా..బాలోత్సవం- అలరించిన సాంస్కృతిక పోటీలు

బాలోత్సవంలో పాల్గొన్న విద్యార్థులతో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

సృజనాత్మకతను నిరంతరం ప్రోత్సహించాలి : లావు రత్తయ్య

ప్రజాశక్తి-గుంటూరు : మట్టితో బొమ్మలు.. విచిత్ర వేషధారణలు..ఉరిమే ఉత్సాహంతో డ్యాన్సులు..చిత్రలేఖన పోటీలు ఇలా రకరకాల సాంస్కృతిక, విద్యాపరమైన అంశాల్లో బాలికలు, బాలురు పోటీ పడ్డారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీసేందుకు జెవివి ఆధ్వర్యంలో స్థానిక హిందూ కాలేజి ప్రాంగణంలో రెండ్రోజులపాటు నిర్వహించనున్న గుంటూరు జిల్లా బాలోత్సవం శనివారం అత్యంత ఉత్సాహ వంతమైన వాతావరణంలో ప్రారంభమైయ్యింది. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి వేలాది మంది విద్యార్థులు ఈ పిల్లల పండుగకు తరలివచ్చారు. తొలుత బాలోత్సవం నిర్వహణ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన ప్రారంభ సభ నిర్వహించారు. ప్రముఖ విద్యావేత్త, విజ్ఞాన్‌ సంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య డోలు వాయించి బాలో త్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బం గా రత్తయ్య మాట్లాడుతూ పూర్వం విజ్ఞానం కలిగిన వారిని గొప్ప వారు అనేవారని, కానీ నేటి ఆధునిక సమాజంలో సృజనాత్మకత, నైపుణ్యం కలిగిన వారిని గొప్పవారని అంటున్నారన్నారు. కావున ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించటానికి కృషి చేయాలన్నారు. పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠాన్నీ ఒక ప్రాజెక్టులాగా మలచటానికి ప్రయత్నించాలన్నారు. పాశ్చాత్య దేశాలలో ప్రాజెక్టు రూపంలో బోధనా పద్దతి ఉంటుందని, అటువంటి విద్యా విధానాన్ని ఇక్కడా అమలు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తారని, చిన్న వయస్సులో పేదరికం గురించి, శ్రమ ప్రాధాన్యత తెలిసిన వారే పెద్దయ్యాక గొప్ప వారు అవుతారన్నారు. చలపతి విద్యా సంస్థల అధినేత వై.వి.ఆంజనేయులు మాట్లాడుతూ ఇటువంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో సమైఖ్యతా భావం అలవడుతుందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా విద్యార్థులు వారికి ఉన్న నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఉండాలన్నారు. ప్రతి ఏటా బాలోత్సవం నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని వె.ౖవి.ఆంజనేయులు ఈ సందర్భంగా అభినందించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుత కార్పొరేట్‌ విద్యా విధానంలో పిల్లలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, మానసిక ఉల్లాసం కొరవడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిలో సృజనాత్మకతను వెలికితీయటానికి, ఈ బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మంలో వాసిరెడ్డి రమేష్‌ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లోనూ బాలోత్సవాలు నిర్వహిస్తున్నా మని, రాష్ట్ర వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో జరుగుతున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో 100 చోట్ల నిర్వహిస్తామని పేర్కొన్నారు. అమరావతి బాలోత్సవం కన్వీనర్‌ పి.మురళీకృష్ణ మాట్లాడుతూ రోజువారీ పాఠశాల సమయంలో 60 శాతం విద్యకు, 40 శాతం విద్యేతర కార్యక్రమాలకు ఉండాలని, అప్పుడే విద్యార్థి సమగ్రంగా అభివృద్ది చెందుతాడని అన్నారు. కానీ ప్రస్తుత విద్యా విధానం ర్యాంకుల చుట్టూ తిరుగుతోందన్నారు. అనంతరం వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. వెస్ట్రన్‌ డ్యాన్స్‌, ఫ్యాన్సీ డ్రస్‌, మిమిక్రీ, ఏకపత్రాభినయం, శాస్త్రీయ సంగీతం, పద్య పఠనం, స్పెల్‌బి, డ్రాయింగ్‌, కేలియోగ్రఫీ, మట్టితో బొమ్మలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు, పాల్గొన్న వారికి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందచేశారు. కార్యక్రమలో హిందూ కాలేజి సెక్రెటరీ చెరువు రామకృష్ణమూర్తి, అభ్యాస్‌ అకాడమీ సిఇఒ డాక్టర్‌ బి.ఫణిపవన్‌ శాస్త్రి, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఎన్‌.తిరుపతయ్య, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి బి.ప్రసాద్‌, కన్వీనర్లు డాక్టర్‌ యం.బోసుబాబు, కెవిఎస్‌ దుర్గారావు, టి.జాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️