బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి-మార్కాపురం: గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అఖిల భారత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా గ్రామీణ బ్యాంకుల అధికారులు, సిబ్బంది శుక్రవారం సమ్మె చేపట్టారు. స్థానిక ఎపిజిబి వద్ద నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా నేత డికెఎం రఫి, ఎఐటియుసి నేత షేక్‌ ఖాశిం ఈ సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, ఉద్యోగులు మాట్లాడారు. లక్షా ఇరవై వేల గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు నేటి సమ్మెలో పాల్గొన్నారన్నారు. దేశ వ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో 41 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారన్నారు. గ్రామీణ బ్యాంకుల వ్యవస్థలో సుదీర్ఘ కాలంగా ఉన్న అపరిష్కృత సమస్యల సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారుల సంఘం, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం సంయుక్తంగా సమ్మెలో పాల్గొన్నాయని కార్యక్రమానికి నాయకత్వం వహించిన అధికారుల సంఘం ప్రాంతీయ కార్యదర్శి సుగుమంచి చంద్రశేఖర్‌ తెలిపారు. దేశంలోని అన్ని గ్రామీణ బ్యాంకుల్ని రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ బ్యాంక్‌గా చేస్తూ ”జాతీయ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి గత మూడు దశాబ్దాలుగా వివిధ రూపాల్లో పోరాడుతున్నామన్నారు. ఆందోళనలో ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆదినారాయణ, అధికారుల సంఘం నాయకులు సందీప్‌, వేణుగోపాల్‌, కృష్ణ, సుమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️