బిసి అభ్యర్థికి టిక్కెట్‌ కేటాయిస్తేనే పొత్తుకు సహకారం

Feb 22,2024 22:26
కాకినాడ రూరల్‌ నియోజ

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

కాకినాడ రూరల్‌ నియోజ కవర్గం నుంచి బిసి అభ్యర్థికే టిక్కెట్‌ను కేటాయించాలని, లేకపోతే పొత్తుకు సహకరించేది లేదని టిడిపికి చెందిన బిసి నాయకులు స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్‌ పలివెల ఉషారాణి స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిడిపికి చెందిన బిసి నాయకులు మాట్లాడారు. రూరల్‌ నియోజక వర్గంలో సుమారు 82 వేల మంది శెట్టిబలిజ ఓటర్లు ఉన్నారని, ఇతర బిసి ఓటరులు సుమారు 50 వేల మంది ఉన్నారని తెలిపారు. అలాంటి నియోజకవర్గంలో బిసిలకు కాకుండా పొత్తులో వేరే సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే తాము పొత్తుకు సహకరించేది లేదన్నా రు. తమ అభిప్రాయాన్ని టిడిపి అధిష్టానంకు తెలియచేసేందుకు మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పారు. టిడిపి, జనసేన పొత్తులో ఈ నియోజక వర్గం టిక్కెట్టు ఎవరికి కేటాయిస్తారనే నేటికీ తేల్చలేదని, ఇరు పార్టీలకు చెందిన నాయకుల్ని సమన్వయం చేసే కార్యక్రమం జరగలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ టిక్కెట్టును మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తికి కాకుండా వేరే వారికి కేటాయిస్తే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా అధికార వైసిపి పార్టీని, ప్రభుత్వాన్ని ఎదుర్కుని అనేక కష్ట నష్టాలు పడినా పార్టీనే నమ్ముకుని ఉన్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల పేరుతో పిల్లి అనంతలక్ష్మికి అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని వారు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. ఈ సమా వేశంలో శెట్టి బలిజ సాధికారిక జిల్లా అధ్యక్షులు పంపన బుజ్జి, మాజీ జడ్‌పిటిసి సభ్యులు బుంగా సింహాద్రి, పెరికి సాధికారిక జిల్లా అధ్యక్షులు నరసింహారావు, విశ్వబ్రాహ్మిన సాధికారిక జిల్లా అధ్యక్షులు పండురు జయకృష్ణా , కొప్పుల వెలమ సంగం అధ్యక్షులు యసలపు కన్నబాబు, తూర్పు కాపు సాధికారిక సమితి జిల్లా కన్వీనర్‌ వెలగల లోవరాజు, రాష్ట్ర రజక సంఘం సభ్యులు తాతపూడి రామకృష్ణ, వాసంశెట్టి అంజిబాబు, అగ్నికుల క్షత్రియ జిల్లా అధ్యక్షులు పెమ్మడి శ్రీను పాల్గొన్నారు.

➡️