బాధ్యులెవరో?

జిఎంసి పరిధిలోని కాంట్రాక్టు పోస్టుల భర్తీలో అవకతవకల కారకులను గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. కడప, పులివెందుల జిఎంసి పరిధిలోని జిజిహెచ్‌, సూపర్‌స్పెషాలిటీ, మానసిక, కేన్సర్‌కేర్‌ విభాగాలకు చెందిన 196 పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల దగ్గర నుంచి దరఖాస్తుల ఆహ్వానం, పోస్టుల భర్తీ ప్రక్రియలో అడుగడుగునా అలసత్వం కనిపించింది. పోస్టులకు తగిన అర్హతలను నిర్ణయించడంలోనూ గందరగోళమే నెలకొంది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో మెడిసిన్‌, న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌ పోస్టులకు అర్హతలు గుర్తించడంలో పొరపాటును అంగీకరించ లేదు. రాష్ట్రంలోని రాజమండ్రి, తూర్పుగోదావరి ఎమెర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ పోస్టులకు పీజీ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించారని నోటిఫికేషన్‌, సెలెక్షన్‌ జాబితాలను చూపుతున్నప్పటికీ జిఎంసి యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం క్షమించరాని అంశం. జిల్లాలోని ఎనిమిది వేల మంది నిరుద్యోగుల ఆశలతో, జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదనే సంగతిని గ్రహించాలి. నిరుద్యోగులతో జిఎంసి అధికార యంత్రాంగం విచక్షణారహితంగా వ్యవహరించడం దారుణం. రిజర్వేషన్లకు అర్హులను నిర్ణయించడంలో తడబడటానికి గల కారకులెరో తేల్చాలి. ప్రతిష్టాత్మకమైన వైద్య విద్యలో ఆరితేరిన అధికార యంత్రాంగం వాస్తవంగా అనుభవం లేక తప్పిదాలకు ఆస్కారమిచ్చిందా, లేక ఇతర ఒత్తిళ్లేమైనా ఉన్నాయా, ఒకవేళ ఒత్తిళ్లు ఉంటే బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేయాలి. ఇటువంటి ప్రయత్నం చేయకుండా నిరుద్యోగుల ఆశలతో చెలగాటమాటడం తగనిపని. ఫైనల్‌ లిస్టు ప్రకటనకు ముందుగా వందలాది దరఖాస్తులు కనిపించడం లేదని ప్రచారం సాగింది. అప్పుడైనా జిల్లా కలెక్టర్‌, జిజిహెచ్‌ బాధ్య కలెక్టర్‌ మేల్కొని ఉండాల్సి ఉంది. మీడియాలో కథనాలు వెల్లువెత్తడంతో డిప్యూటీ సిఎం.అంజాద్‌బాషా సీరియస్‌గా స్పందించడంతో రీవెర్ఫికేషన్‌ తెరపైకి వచ్చింది. లేనిపక్షంలో రివైజ్డ్‌ ఫైనల్‌ లిస్టు పెట్టకుండానే సెలెక్షన్‌ లిస్టు ప్రకటించడమేమిటని కలెక్టర్‌ ప్రశ్నించి ఉండాలి. అప్రూవల్‌ ఫైలుపై సంతకం చేయడానికి నిరాకరించి ఉండాలి. డిప్యూటీ సిఎం సీరియస్‌గా స్పందించిన అనంతరం రీవెర్ఫికేషన్‌ పూనుకోవడం గమనార్హం. రీవెర్ఫికేషన్‌ పేరుతో ఆగమేఘాల మీద పండుగలు, సెలవులతో నిమిత్తం లేకుండా జిల్లాలోని పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో రీవెర్ఫికేషన్‌కు పూనుకోవడం పట్ల విమర్శలు ఉన్నాయి. మీడియా కథనాలకు అందని అక్రమాలు వెలుగులోకి వస్తే పరిస్థితేమిటని, వాటిని కూడా అడ్రెస్‌ చేయడానికి తగిన గడువును ఇచ్చి ఉంటే బాగుండేదనే సూచనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా బాధ్య కలెక్టర్లు కాంట్రాక్టు పోస్టుల భర్తీలో అవకతవకలకు కారకులను గుర్తించి, కింది స్థాయి ఉద్యోగులను బలి పశువులను చేయకుండా బాధ్యత కలిగిన ఉన్నతాధికారుల బాధ్యతా రాహిత్యాన్ని సైతం వెలుగులోకి తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️