బత్తలపల్లిలో ‘తమ్ముళ్ల’ ఘర్షణ

ఘర్షణ నేపథ్యంలో బత్తలపల్లి టిడిపి కార్యాలయం వద్ద తెలుగుదేశం మద్దతుదారులను అక్కడి నుంచి పంపి వేస్తున్న పోలీసులు

        బత్తలపల్లి : శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలో టిడిపి నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా..కదిలి రా కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌లు వర్గీయులు బత్తలపల్లి మండల కేంద్రంలో ఎదురెదురుగా తలబడి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన దాదాపు 25 వాహనాలు ధ్వంసం అయ్యాయి. రాళ్ల దాడిలో ఆరుగురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకర్గం కేంద్రం సమీపంలోని కియా వద్ద టిడిపి ఆధ్వర్యంలో రా..కదిలి రా కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొనేందుకు ధర్మవరం నియోజకర్గం నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆధ్వర్యంలో పెద్దఎత్తున వారి అభిమానులు బయళ్దేరారు. వందలాది వాహనాలు ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల నుంచి బత్తలపల్లి మీదుగా చంద్రబాబు బహిరంగ సభకు బయళ్దేరారు. బత్తలపల్లి టిడిపి కార్యాలయం వద్దకు సూర్యనారాయణ మద్దతుదారుల వాహనాలు రాగానే శ్రీరామ్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిగి సూర్యనారాయణ వర్గీయులు కూడా నినాదాలు చేశారు. శ్రీరామ్‌, సూర్యనారాయణకు మద్దతుగా వారివారి అనుచరులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్లదాడిలో సూర్యనారాయణ మద్దతుదారులకు చెందిన 20 వాహనాలు, శ్రీరామ్‌ మద్దతుదారులకు చెందిన 5 కార్లు ధ్వంసం అయ్యాయి. రాళ్ల దాడిలో ఇరు వర్గాలకు చెందిన ఆరుగురి తలలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో టిడిపి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ముదిగుబ్బ, ధర్మవరం సిఐలు యతీంద్ర, కరుణాకర్‌లు సిబ్బందితో బత్తలపల్లికి చేరుకున్నారు. ఇరువర్గాల వారిని అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో సమస్య సర్ధుమనిగింది. కాగా టిడిపిలో నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న అందోళన టిడిపి నాయకుల్లో వ్యక్తం అవుతోంది.

➡️