బంద్‌ దాక తీసుకురావొద్దు

తాడేపల్లిలో సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతున్న పి.మధు
ప్రజాశక్తి-తాడేపల్లి : మున్సిపల్‌ కార్మికుల సమస్యను త్వరగా పరిష్కరిస్తే ప్రభుత్వానికి మంచిదని, సమస్యను బంద్‌ దాకా తీసుకురానివ్వద్దని ప్రభుత్వానికి మాజీ ఎంపీ పి.మధు సూచించారు. తాడేపల్లి మున్సిపల్‌ జోనల్‌ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ కార్మికుల సమ్మె శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు. పోరాటం అభినందనీయమని, ఇదేవిధంగా ఐక్యంగా పోరాడితే విజయం సాధించి తీరుతారని చెప్పారు. పోరాటాల వల్లే హక్కులు సాధించు కుంటామన్నారు. డబ్బులు లేవని అంటున్న ప్రభుత్వానికి ఎక్కడున్నాయో తాము చెబుతా మని, ఇసుక, మద్యంతో పెద్దఎత్తున అక్రమ సంపాదన పోగుపడుతోందని అన్నారు. మున్సి పల్‌ కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించాలని, వారి కాళ్లు కడగటం కంటే వారు బతకడానికి సరిపడా జీతం ఇవ్వడం అవసరమని చెప్పారు. మున్సిపల్‌ కార్మికులకు జీతాలు పెంచడంతో పాటు ఇళ్లస్థలాలు, ఇళ్లు నిర్మించి కాలనీలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు మాట్లాడుతూ శ్రమకు తగ్గ ఫలితం కోరడం నేరం కాదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజల మద్దతు ఉందని చెప్పారు. కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా సిఐటియు నాయకులు ఎం.రవి, కె.కరుణాకరరావు, వి.దుర్గారావు, ఎ.శౌరిబర్తులం, కె.వెంగమ్మ, నాగమణి, డి.విజయబాబు, వి.శాస్త్రి, ఎం.డేవిడ్‌రాజు, సిహెచ్‌.మరియదాసు, కృష్ణతులసి, ఆర్‌.వేణు, కుశలవరావు, ఎఐటియుసి నాయకులు పి.వెంకటయ్య, ఎం.రామారావు పాల్గొన్నారు.

➡️