ప్రయాణ కష్టాలు..

Jan 9,2024 00:02
సంక్రాంతి పండుగ వేళ

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. సామర్లకోట నుంచి ఉప్పాడ చేరుకోవాలంటే ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతం. ఉప్పాడ నుంచి సామర్లకోటకు ఆర్‌టిసి సేవలు లేకపోవడంతో ప్రయాణికుల ద్విచక్రవాహనాలు, ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాలనే ఆశ్రయించాల్సివస్తోంది. ఇదే అదునుగా ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాలు ప్రయాణికుల అవసరతను బట్టి అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే వాదన ప్రయాణికుల నుంచి విన్పిస్తోంది. సాధారణ రోజుల్లోనే పరిస్థితి ఇలావుంటే..పండుగ వేళ ప్రయాణికుల కష్టాలకు అన్నీ ఇన్నీ కావు.

సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతం. తమ గమ్యస్థానం చేరుకునేందుకు వివిధ వాహనాల్లో ప్రాణాలకు తెగించి మరీ ప్రయాణాలు సాగిస్తున్నారు కొంతమంది ఆటోలో ఎక్కలేక కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణం సాగిస్తూ ప్రమాదాలు బారిన పడుతున్నారు కొత్తపల్లి మండలానికి ఆర్‌టిసి సేవల సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోల పై ఆధారపడి ప్రయాణాలు సాగించవలసి వస్తుంది. ఇదే అదునుగా పండగ సీజన్‌ కావడంతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. అదిరి పేట నుంచి కాకినాడకు రెండు ఆర్‌టిసి బస్సులు తిరుగుతున్న ప్రయాణికులు అధికం కావడంతో వేలాడుతూ ప్రయాణించవలసి వస్తుంది. ఏ మాత్రం ఆదమరిసిన ప్రాణాల పోయే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఉప్పాడ నుంచి పిఠాపురం వెళ్లాలంటే ఆటోలలో ప్రయాణించవలసిందే. ఆటోవాలాలు అధికంగా ప్రయాణికుల్ని ఎక్కించుకుని గమ్యస్థానాన్ని చేరుస్తున్నారు. అయితే ఏమాత్రం ప్రమాదం చోటు చేసుకున్న గాయాల పాలు కాక తప్పదనే ఆందోళనలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకున్నాయి. గత ఏడాదిలో సుమారు ఆరు ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయాలపాలయ్యారు. సంక్రాంతి సెలవులకు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ట్రైన్‌ ద్వారా చేరుకుంటారు. పిఠాపురంలో రైల్వే స్టేషన్‌ ఉన్నప్పటికీ అక్కడ కొన్ని రైళ్లకు మాత్రమే ఆల్ట్‌ ఉంది. దీంతో అధికశాతం ప్రయాణికులు సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వెళ్లడం సహజం. ఉప్పాడ నుంచి సామర్లకోట వరకు ఆటోలపై అధిక సొమ్ములు వెచ్చించి ప్రయాణిస్తున్నారు.

ఉప్పాడ వయా పిఠాపురం సామర్లకోట వరకు ఆర్‌టిసి సేవలను ప్రారంభిస్తే ప్రయాణించేందుకు అణువుగా ఉంటుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోజుకు వందలమంది ప్రయాణాలు యు.కొత్తపల్లి మండలం నుంచి రోజూ వ్యాపారాలు, యాత్రలకు, ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు, ఇలా వందలాది మంది సామర్లకోట రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన పిఠాపురం చేరుకోవడానికి విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు వేలాదిగా నిత్యం రాకపోకలు సాగిస్తారు ఉప్పాడ నుంచి సామర్లకోటకు అప్పటి ఎంఎల్‌ఎ వంగా గీత సూచనలతో ఆర్‌టిసి బస్సులు నడిచేవి. తరువాత ఎందుకో ఆ సర్వీసులను ఆర్‌టిసి యాజమాన్యం నిలుపుదల చేసింది. నాటి సర్వీసులను పునరుద్ధరిస్తే మూలపేట, ఉప్పాడ, కొత్తపల్లి, వాకతిప్ప, కుతుకుడి మిల్లి, కొండవరం, నాగులపల్లి, తదితర గ్రామాల ప్రజల ప్రయాణాలు సులభతరం అవుతాయి.

ప్రయివేటు వాహనాల అదనపు వసూళ్లు

మండలం నుంచి సామర్లకోటకు ఆర్‌టిసి సేవలు లేకపోవడంతో ప్రయివేటు వాహన యజమానులు ఇష్టారాజ్యంగా అదనపు ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఉప్పాడ నుంచి సామర్లకోటకు ఆర్‌టిసి బస్సులో రూ.25లతో చేరుకునే అవకాశం ఉంది. అయితే ఆర్‌టిసి సర్వీసులు లేకపోవడంతో ప్రస్తుతం ఉప్పాడ నుంచి పిఠాపురంకు రూ.30, పిఠాపురం నుంచి సామర్లకోటకు రూ.30 మొత్తంగా రూ.60 వరకూ ప్రయాణికులు చెల్లించాల్సివస్తోంది. ప్రస్తుతం పండగ సీజన్‌ కావడంతో సామర్లకోట చేరుకోవాలంటే 80 రూపాయలు చెల్లించవలసి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌టిసి సర్వీసులను పునరుద్ధరించాలి

సామర్లకోట రైల్వే స్టేషన్‌ చేరుకునేందుకు వీలుగా ఉప్పాడ నుంచి సామర్లకోట వరకు ఆర్‌టిసి సర్వీసులను పునరుద్ధరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా సెలవులు ఇవ్వడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నామని ఆర్‌టిసి బస్సులు లేకపోవడంతో ఆటోలపై ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్‌టిసి సర్వీసులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️