ప్రభుత్వ అలసత్వంతో రైతులకు నష్టం

ప్రజాశక్తి – వీరవాసరం

తుపాను పంట నష్టాన్ని అంచనా వేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విమర్శించారు. టిడిపి, జనసేన నాయకులు సోమవారం పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుపానుతో పాటు మురుగు కాలువల్లో పూడిక తీయకపోవడం వల్లే అధిక నష్టం జరిగిందని రైతులు మతల పెద్దబ్బాయి, దూసనపూడి శ్రీనివాసరావు టిడిపి పరిశీలన బృందం పెచ్చెట్టి బాబు, సిహెచ్‌. రామాంజనేయులు, కె.నాగేంద్రబాబు, దాసరి ఆంజనేయులు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం పంటను కోసినా మిషన్‌ ఖర్చులు తప్ప పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందన్నారు. నష్టపరిహారం పొందిన వారి ధాన్యం కొనుగోలు చేయమని అంటున్నారని అసలు నిబంధనలు ఏంటో తెలియడం లేదని వాపోయారు. అనంతరం టిడిపి, జనసేన నాయకుల ఆధ్వర్యంలో తహశీల్దార్‌ సుందరాజుకు వినతిపత్రం అందజేశారు. తక్షణం ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన మండల అధ్యక్షులు కొల్లేపర శ్రీనివాసరావు, జవ్వాది బాలాజీ, ఎంపిపి వీరవల్లి దుర్గాభవాణి చంద్రశేఖర్‌, వైస్‌ ఎంపిపిలు పాల్గొన్నారు.పోడూరు : మిచౌంగ్‌ తుపాన్‌ రైతులకు తీవ్రనష్టం మిగిల్చిందని, ప్రభుత్వం ఇప్పటి వరకూ నష్ట నివారణ చర్యలు చేపట్టలేదని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం గుమ్మలూరులో తోటమెరక ప్రాంతాల్లో తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలను మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్‌, టిడిపి తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జి వలవల బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి శ్యామ్‌ చంద్రశేషుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అంగర మాట్లాడుతూ తుపాన్‌ వచ్చి ఐదు రోజులైనా ప్రభుత్వం తరపున పంట నష్టం అంచనా వేసేందుకు ఒక్కరూ రాకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి శేషు, వలవల బాబ్జీ మాట్లాడుతూ మంత్రి కారుమురి నాగేశ్వరరావు తుపాన్‌ వల్ల పెద్దగా నష్టం ఏమీ జరగలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, నియోజకవర్గ పరిశీలకులు బోళ్ల సతీష్‌ బాబు, ఆచంట జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు పాల్గొన్నారు.ఆచంట : భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం కొడమంచిలిలో టిడిపి ఆధ్వర్యంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతుల నుంచి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయంతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వలవల బాబ్జీ, అంగర రామ్మోహన్‌రావు, దాసరి శ్రీను సుందరం, శేషు, జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు పాల్గొన్నారు.

➡️