ప్రభావం చూపుతారా..!

Mar 13,2024 22:49
ప్రభావం చూపుతారా..!

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ముద్రగడ అంటే ఒక సంచలనం. ఎన్ని పార్టీలు మారినా, ఎలా వ్యవహరించినా గోదావరి జిల్లాలో ఆయనకో ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. గోదావరి జిల్లాలకే కాదు, ఎపిలోనే సీనియర్‌ నేతల్లో ఆయన ఒకరు. 1978 లోనే అసెంబ్లీ గడపతొక్కిన నేతల్లో చంద్రబాబునాయుడితో పాటు ముద్రగడ మాత్రమే కొనసాగుతున్నారు. గతంలో ఆయన రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉండేవారు. 2009చ 20014 ఎన్నిక్లఓ్ల వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2015 నుంచి 2016 మధ్యలో జరిగిన కాపు ఉద్యమంతో మళ్లీ ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. 2016 జనవరిలో ఆయన హయాంలో తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ, రైలు దగ్ధం ఘటనలతో వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత కాపు ఉద్యమం ముందుకు సాగిన దాఖ లాలు లేవు. దాంతో సుమారు పదేళ్లుగా ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అనేక పరిణామాల అనంతరం ముద్రగడ వైసిపి కండువా వేసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఈ తరుణంలో ఎన్నికల్లో ఆయన ప్రభావంపై సర్వత్రా చర్చజరుగుతుంది. రాజకీయంగా ఆయన గడచిన ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా ఏ పార్టీకి ఓటు వేయాలన్నది మాత్రం స్పష్టం చేయలేదు. ఈసారి మాత్రం నేరుగా వైసిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 14న తన కుమారుడు గిరితో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. జనసేన ద్వారా కాపు ఓట్లను దక్కించుకోవాలనే ఆలోచనలో టిడిపి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి ఎత్తుగడకు చెక్‌ పెట్టడం కోసం ముద్రగడను వైసిపి రంగంలోకి దింపింది. ఆయనకు ఎక్కడా సీటును మాత్రం ఖరారు చేయలేదు. ఈ తరుణంలో జనసేన ఓట్లను వైసిపి వైపు ముద్రగడ ఏ మేరకు మళ్లించగలుగుతారనేది ప్రశ్న. ఒక్కకాపు సామాజికవర్గంలోనే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. వారి ఓట్లను ఆయన అధికార పార్టీవైపు ఎలా మళ్లిస్తారో చూడాలి. కోనసీమ ప్రాంతంలో ముద్రగడకు అనుచరులు ఎక్కువ. వారిలో చాలా మంది ఇప్పుడు జనసేనలో ఉన్నారు. వారిని ఆయన ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది చూడాలి.

➡️