ప్రధాన కాలువల్లో పూడికను తొలగించాలి

Dec 6,2023 00:06
ఆదర్శ్‌, జైరాం పాల్గొన్నారు.

ప్రజాశక్తి – కాకినాడ

కాకినాడ నగర శివార్లలో ప్రధాన కాలువల్లో పూడికను తొలగించి ముంపును నివారించాలని సిపిఎం బృందం డిమాండ్‌ చేసింది. మంగళవారం సిపిఎం బృందం కాకినాడ నగరంలో రామకృష్ణారావు పేట, కామేశ్వరి నగర్‌, డైరీఫారం, సంజరు నగర్‌, పర్లోవపేట, సూర్యనారాయణపురం, ఏటిమొగ, గోళీలుపేట, జె.రామారావు పేట, మహాలక్ష్మి నగర్‌, ముత్తానగర్‌, జగన్నాధపురం రెల్లివీధి, అన్నమ్మ ట్యాంక్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు మాట్లాడుతూ గతంతో పోలిస్తే ముంపు తగ్గుముఖం పట్టిందన్నారు. ఇటీవల నగరంలో నూతనంగా నిర్మించిన సిసి డ్రయిన్లు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాల్లో వేసిన సిసి రోడ్స్‌ ముంపు నివారణకు తోడ్పడ్డాయన్నారు. అదేవిధంగా నగర పాలక సంస్థ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, కార్మికులు ముందస్తుగా తీసుకున్న చర్యలు కూడా రోడ్లపై ఎక్కువసేపు నీరు నిలవకుండా చేసిందన్నారు. నగర పాలక సంస్థ అధికారులు, కార్మికులకు సిపిఎం తరపున అభినందనలు తెలిపారు. అయితే జె. రామారావు పేట, మహాలక్ష్మి నగర్‌ ప్రాంతాల్లో కొన్ని వీధుల్లో నీరు నిలిచి పోయిందన్నారు. మురికినీరు గృహాల వాకిట్లోకి వచ్చేస్తుందన్నారు. శివార్లలో సముద్రపాయలను కలిపే మెయిన్‌ డ్రయిన్స్‌ పూడికలు క్లియర్‌ చేస్తే ఆయా ప్రాంతాల్లో ముంపు నివారణ జరిగే అవకాశం ఉందన్నారు. అదే విషయాన్ని అధికారులకు సోషల్‌ మీడియా ద్వారా తెలియచేశామన్నారు. పనులు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం కోరుతుందన్నారు. ఈ పర్యటనలో సిపిఎం నాయకులు మలక వెంకట రమణ, ఆదర్శ్‌, జైరాం పాల్గొన్నారు.

➡️