ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బాండ్లు

Mar 22,2024 05:20 #edite page

విరాళాలు పొందడం కోసం బిజెపి రెండు వినాశకర పద్ధతులను అనుసరించింది. ఒకటి-ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రకృతి సంపదను కారుచౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం, ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం. ఇది క్విడ్‌ ప్రో కో పద్ధతి. ‘నీకు ఇంత, నాకు అంత’ అనేది ఈ విధానం. రెండు-రాజ్యాంగబద్ధ సంస్థలైన ఇ.డి, సిబిఐ, ఆదాయ పన్ను శాఖలను దుర్వినియోగం చేయడం. ఇందులో దాడులు-విరాళాలు అనే పద్ధతిని నీతిబాహ్యంగా మేళవించింది. అక్రమంగా పొందిన ఈ డబ్బుతో ఒకవైపు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి, ఎన్నికైన ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి వినియోగించారు. అందుకే మోడీ పాలనా కాలంలో13 రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల స్థానంలో బిజెపి పాలించగలిగింది. మరికొన్ని రాష్ట్రాల్లో అలా పాలించడానికినిత్యం బెదిరింపులకు తెగబడుతున్నది. మరోవైపు మతం,ధర్మం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి రూ.వేల కోట్లను విచ్చిలవిడిగా ఖర్చు చేయగలుగుతున్నది.

దేశంలో కార్పొరేట్‌ కంపెనీలకు, పాలక పార్టీలకు మధ్య రహస్య ఆర్థిక బంధం ఎంత బలంగా పెనవేసుకుందో ఎన్నికల బాండ్ల వ్యవహారం కొంతైనా బట్టబయలు చేసింది. నీతి, జాతి, దేశభక్తి, దైవభక్తి లాంటి మాటల గారడీల వెనుక దేశ పాలకులు జరిపిన కుతంత్రాలు సుప్రీంకోర్టు తీర్పుతో కొన్ని వెలుగులోకి వచ్చాయి. నల్లడబ్బు వెలికితీత, అవినీతి అంతం అనే పదాలకు ఇ.డి, ఐ.టి దాడులకు, సోదాలకు అర్థాలు వేరులే అని రుజువైంది. దేశ ప్రజలకు వేల ధర్మోపదేశాలు (మన్‌ కీ బాత్‌) చేసిన స్వయం ప్రకటిత విశ్వగురువు ఏలుబడిలో ప్రజాస్వామ్యానికి ఎంత భయంకరమైన చీడ పట్టిందో తేటతెల్లమైంది.
ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో పెట్టిన ఎన్నికల బాండ్ల రెండు జాబితాల ప్రకారం రూ.16,492 కోట్ల విరాళాలు వివిధ రాజకీయ పార్టీల ఖాతాలకు చేరాయి. ఇందులో ఒక్క బిజెపికే రూ.8,250 కోట్లు దక్కాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనం చేయడం, అవినీతిని చట్టబద్ధం చేయడం, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం, దేశ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు దోచి పెట్టడమనే బిజెపి దుష్ట పన్నాగంలో భాగమే 2017లో మనీబిల్లు రూపంలో వచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల విధానం. ఆ పార్టీ ఆశించినట్లగానే వేల కోట్ల రూపాయలను సొంతం చేసుకుని ప్రజాస్వామ్య పునాదులను పెకిలించడానికి ప్రయత్నిస్తున్నది. ఈ విరాళాలు పొందడం కోసం బిజెపి రెండు వినాశకర పద్ధతులను అనుసరించింది. ఒకటి-ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రకృతి సంపదను కారుచౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం, ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం. ఇది క్విడ్‌ ప్రో కో పద్ధతి. ‘నీకు ఇంత, నాకు అంత’ అనేది ఈ విధానం. రెండు-రాజ్యాంగబద్ధ సంస్థలైన ఇ.డి, సిబిఐ, ఆదాయ పన్ను శాఖలను దుర్వినియోగం చేయడం. ఇందులో దాడులు-విరాళాలు అనే పద్ధతిని నీతిబాహ్యంగా మేళవించింది. అక్రమంగా పొందిన ఈ డబ్బుతో ఒకవైపు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి, ఎన్నికైన ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి వినియోగించారు. అందుకే మోడీ పాలనా కాలంలో 13 రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల స్థానంలో బిజెపి పాలించగలిగింది. మరికొన్ని రాష్ట్రాల్లో అలా పాలించడానికి నిత్యం బెదిరింపులకు తెగబడుతున్నది. మరోవైపు మతం, ధర్మం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి వేల కోట్లను విచ్చిలవిడిగా ఖర్చు చేయగలుగుతున్నది.
ఎన్నికలు-ఎన్నికల బాండ్ల విరాళాలు
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల్లో బిజెపి భారీగా లబ్ధి పొందడానికి ఈ విధానం నేరుగా ఉపయోగపడింది. 2019లో బిజెపి తిరిగి రెండవసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈ విధానం ఆ పార్టీకి బాగా తోడ్పడింది. 2019 ఏప్రిల్‌-మే నెలల మధ్యలో బిజెపి ఖాతాలోకి రూ.1,771.57 కోట్లు భారీ మొత్తం జమయ్యింది. ఆ సంవత్సరం ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ.1,056.86 కోట్లు బిజెపి ఖాతాకు చేరడం వెనుక కార్పొరేట్‌ కంపెనీలకు, బిజెపి గెలుపుకు వున్న లంకె ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఎన్నికల అనంతరం ప్రైవేటీకరణ వేగం పెరగడానికి, అడవులు, ఓడరేవులు, రోడ్లు, విమానాశ్రయాలు, గనులు పెద్ద ఎత్తున కార్పొరేట్‌ సంస్థల ఆస్తులుగా మారడానికి, బిజెపి గెలుపుకు ఈ ఆర్థిక సంబంధమే మూలం. అందుకే అదానీ లాంటి వారు ప్రపంచ కుబేరులుగా మారగలుగుతున్నారు. ఇది ఇంతటితో ఆగలేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోడీనే ప్రధాన పోటీదారుడుగా మారడం వెనుక రహస్యం కూడా ఈ బంధం కొనసాగింపులో భాగమే. 2021 జనవరి-ఏప్రిల్‌ మధ్య పశ్చిమ బెంగాల్‌, అస్సాం, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిని బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల కాలంలో బిజెపికి రూ. 292 కోట్లు అందాయి. 2023లో చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజాస్థాన్‌, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ సంవత్సరం జులై-డిసెంబర్‌ మధ్య రూ. 1,149 కోట్లు బిజెపికి చేరాయి. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన 2021 ఏప్రిల్‌, 2022 జనవరి, నవంబర్‌, 2023 ఏప్రిల్‌, అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో అత్యధిక విరాళాలను ఆ పార్టీ పొందింది.
బిజెపి తర్వాత ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధికంగా లాభపడిన పార్టీ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌. ఈ పార్టీ 2019 ఏప్రిల్‌-2024 జనవరి మధ్య పొందిన విరాళాల మొత్తం రూ.1,609.5 కోట్లు. ఆ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ప్రజాపాలన అందించిన కమ్యూనిస్టులను అధికారానికి దూరం చేయడం వెనుక దోపిడి వర్గాలతో పాటు, ఆధునిక కార్పొరేట్‌ కంపెనీల పాత్ర కీలకమైంది. అందుకే ఒక రాష్ట్రంలో మాత్రమే వున్న తృణమూల్‌ కాంగ్రెస్‌కు పెద్ద మొత్తంలో ఎన్నికల బాండ్ల విరాళాలు అందాయి. 2021లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సందర్భంగా అత్యధికంగా డబ్బు పోగేసుకున్న టిఎంసి ఆ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఖర్చు చేసింది. ఎన్నికల ఫలితాల (2021 మే2) తర్వాత కూడా టిఎంసి పార్టీకి విరాళాల పరంపర కొనసాగింది. 2022లో రూ.468 కోట్లు, 2023లో రూ. 562 కోట్లు, 2024 జనవరి లో రూ.130 కోట్ల ఎన్నికల బాండ్ల విరాళాలు తృణముల్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకి చేరాయి.
కాంగ్రెస్‌ పార్టీకి అందిన ఎన్నికల బాండ్ల మొత్తం రూ.1,421.8 కోట్లు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏప్రిల్‌-మే నెలల మధ్య రూ.168 కోట్ల విలువ చేసే ఎన్నికల బాండ్లు పొందగా, ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోవడంతో కార్పొరేట్‌ కంపెనీలు, విరాళాలు ఇచ్చే సంపన్నులు ఆ పార్టీ వైపు శీతకన్ను వేశాయి. అందుకే ఆ సంవత్సరం అక్టోబర్‌లో కేవలం 1.7 కోట్ల ఎన్నికల బాండ్లు మాత్రమే వచ్చాయి. అయితే మరలా రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు ఓటములను బట్టి విరాళాల పంపకం మారుతూ వచ్చింది. 2022 జనవరి-ఏప్రిల్‌ మధ్య పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా రూ.127 కోట్ల బాండ్ల విరాళాలు కాంగ్రెస్‌ పొందింది. అయితే ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీ ఆశించినంత ఫలితాలను సాధించలేకపోవడంతో అదే సంవత్సరం అక్టోబర్‌లో రూ.37 కోట్ల విరాళాల స్థాయికి పడిపోయింది. మరలా 2022 డిసెంబర్‌ నెలలో హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడంతో 2022 డిసెంబర్‌, 2023 ఏప్రిల్‌ మధ్య రూ.209 కోట్ల విరాళాలు కాంగ్రెస్‌ ఖాతాకు జమ అయ్యాయి. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఈ పార్టీకి 2023 అక్టోబర్‌లో రూ.401 కోట్లు, నవంబర్‌లో రూ.179 కోట్ల విరాళాలు అందాయి. ఇదే పద్ధతుల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి, టిడిపి పార్టీలకు విరాళాలు వచ్చాయి.
ఎన్నికల బాండ్ల రూపంలో వివిధ పార్టీలకు అందిన విరాళాలు ఆయా పార్టీల మీద ప్రేమతోనో, అభిమానంతోనో వచ్చినవి కాదు. తమకు బాగా దోచి పెట్టగలిగిన పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనో లేదా గెలిచిన పార్టీకి భారీ విరాళాలు ఇచ్చి తమకు అనుకూలమైన విధానాలను రూపొందించుకోవాలనే ఉద్దేశంతోనో కార్పొరేట్‌ కంపెనీలు ఇచ్చినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.
ఇ.డి, ఐ.టి దాడులు-ఎన్నికల విరాళాలు
అవినీతి, అక్రమాలను అరికట్టాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, సిబిఐ, ఇన్‌కంటాక్స్‌ శాఖలు పూర్తిగా అధికార పార్టీల సేవలో తరిస్తున్నాయనే విమర్శ చాలాకాలంగా వుంది. అయితే గత పది సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఈ సంస్థలు ఎన్నడూ లేనంతగా దుర్వినియోగమయ్యాయి. ముఖ్యంగా ఈ సంస్థలు అవినీతి కార్యకలాపాలను అరికట్టేందుకు చేపట్టే చట్టబద్ధ దాడులు, సోదాలను కూడా తమకు నిధులను రాబట్టుకునేందుకు బిజెపి పెద్ద ఎత్తున వినియోగించుకుంది. అత్యధిక ఎన్నికల బాండ్ల విరాళాలు ఇచ్చిన ఫ్యూచర్‌ గేమింగ్‌ సంస్థపై 2022 ఏప్రిల్‌ నుండి 2023 మే మధ్య ఐదుసార్లు ఇ.డి దాడులు లేదా సోదాలు జరిగాయి. దాడులు జరిగిన ప్రతిసారీ ఈ సంస్థ ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. రూ. 1,368 కోట్లను ఎన్నికల బాండ్ల విరాళాలను పిండేసింది. అనేక అక్రమాలకు పాల్పడినట్లు ప్రకటించింది. అయితే ఈ దాడులు జరిగిన ప్రతిసారీ ఈ సంస్థ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది. వాటి విలువ రూ.1,368 కోట్ల ఎన్నికల బాండ్ల విరాళాలు. 2022 ఏప్రిల్‌ 1,2 తేదీలలో ఇ.డి దాడులు చేసిన వెంటనే అదే నెల 7వ తేదీ వంద కోట్ల విలువ చేసే ఎన్నికల బాండ్లను విరాళంగా ఇచ్చింది. తిరిగి ఇదే సంవత్సరం జులై నెలలో ఇ.డి సోదాలు చేసింది. వెంటనే అదే నెల 6వ తేదీ రూ.75 కోట్ల విరాళం, సెప్టెంబర్‌లో మరల సోదాలు, దాడులు జరిగాయి. అక్టోబర్‌ 6న రూ.105 కోట్ల ఎన్నికల బాండ్లను, 2023 ఏప్రిల్‌, మే నెలలో జరిగిన దాడుల తర్వాత రూ.213 కోట్ల ఎన్నికల బాండ్లను విరాళంగా ఇచ్చింది.
మెగా ఇంజనీరింగ్‌ మీద 2019 అక్టోబర్‌లో దాడులు ఐదు కోట్ల విరాళం, వేదాంత లిమిటెడ్‌ మీద 2020 మార్చి, ఆగస్టు నెలలో ఇ.డి, ఐ.టి దాడులు, రూ.161.75 కోట్ల ఎన్నికల బాండ్ల విరాళం, నవయుగ ఇంజనీరింగ్‌ ఆఫీసుపై 2018 అక్టోబర్‌లో దాడులు రూ.30 కోట్ల విరాళం, హెట్రో ఫార్మా గ్రూప్‌పై 2021 అక్టోబర్‌లో దాడులు రూ.40 కోట్ల విరాళం, డిఎల్‌ఎఫ్‌ గ్రూప్‌ పై మూడుసార్లు ఇ.డి సోదాలు రూ.50 కోట్ల విరాళం, రెడ్డీస్‌ ల్యాబ్‌పై 2023లో దాడులు రూ.21 కోట్ల విరాళం, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై 2023 డిసెంబర్‌ 20న ఇ.డి, ఐ.టి దాడులు 2024 జనవరి 11వ తేదీన రూ.40 కోట్ల విరాళం. ఇలా ఒకటేమిటి 2019 నుండి ఇ.డి, ఐ.టి దాడులు చేసిన 21 కంపెనీల నుండి రూ.1,072.75 కోట్ల ఎన్నికల బాండ్ల విరాళాలు రాజకీయ పార్టీలకు అందాయి. వీటిలో అత్యధిక భాగం బిజెపి ఖాతాకు చేరాయి.
బిజెపి చెప్పే అవినీతి రహిత పాలన మేడిపండు లాంటిదని ఎన్నికల బాండ్ల పొట్ట విప్పితే దాని అసలు గుట్టు బయటపడుతుందనే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు సకల ప్రయత్నాలు చేసింది, చేస్తుంది. తన ఏలుబడిలో జరిగిన అంతులేని ఈ అవినీతికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పార్టీ మూడోసారి అధికారం కోసం పాకులాడుతున్నది. ఎన్నికల బాండ్ల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టే బిజెపిని గద్దె దింపడమే ఆ పార్టీకి ప్రజలు విధించాల్సిన శిక్ష.

/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు/

➡️