పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

Feb 26,2024 22:37

ఎస్‌పి అజిత వేజెండ్ల
ప్రజాశక్తి – తణుకురూరల్‌
పోలీస్‌ వ్యవస్థను ప్రజలకు జవాబుదారీగా తెచ్చేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్‌పి అజిత వేజెండ్ల అన్నారు. స్థానిక తణుకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఆమె పాల్గొని 11 ఫిర్యాదులు స్వీకరించారు. ఆ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌ నైసర్గిక స్వరూపాన్ని రేఖా చిత్రం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్టేషన్‌ పరిధిలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లోని ప్రజలతో తరచూ అవగాహనా సదస్సులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ఎన్నికల నిర్వహన కోసం ఏర్పాటు చేసే పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల గురించి సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, పోలీంగ్‌ కేంద్రాలను తనిఖీలు చేయాలన్నారు. గతంలో ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితులను బైండవర్లు చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ముందుగా తెలుసుకుని, సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరిస్తే అది ప్రజాశాంతికి భంగం కలగకుండా నిరోధించగలమని తెలిపారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన ఓటు హక్కును ప్రజలు నిర్భయంగా, ప్రలోభాలకు గురి కాకుండా వినియోగించుకునేలా ప్రజలకు పోలీసువారు భరోసా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి వి.భీమారావు, తాడేపల్లిగూడెం డివిజన్‌ డిఎస్‌పి మూర్తి, దిశ పోలీస్‌ స్టేషన్‌ డిఎస్‌పి నున్న మురళీకృష్ణ, తణుకు రూరల్‌ సిఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ కె.చంద్రశేఖర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️