పోలీసులకు అంగన్‌వాడీలు సమ్మెనోటీసు

 ప్రజాశక్తి – కురుపాం : అంగన్‌వాడీ కార్యకర్తలు వారి హక్కుల సాధనకు ఈనెల 8 నుంచి చేపడుతున్న నిరవధి సమ్మె కారణంగా బుధవారం స్థానిక పోలీసు సిబ్బందికి సిఐటియు నాయకులు వి. ఇందిర, యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సరళకుమారి సమ్మె నోటీసును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, 0-6 ఏళ్లలోపు పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు, అనేక సేవలందిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడంలేదన్నారు. నిరంతరం నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌, ఆర్టీసీ, రైల్వే ధరలు పెరుగుతున్నా వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉందన్నారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణా కంటే రూ.వెయ్యి ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదన్నారు. అంగన్వాడీల హక్కుల సాధనకు ఈనెల 8 నుంచి సమ్మె చేపడుతున్నామని, ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అంగనవాడీ వర్కర్ల జిల్లా కార్యదర్శి జె.సరోజ, అంగన్వాడీలు కృష్ణవేణి, రాధా కుమారి, సూర్యకుమారి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.డిసిసి అధ్యక్షునికి వినతిగుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు నిమ్మక సింహాచలం కు కురుపా నియోజకవర్గం అంగన్వాడీ యూనియన్‌ సభ్యులు తమ సమస్యలపై కలిసి పోరాడాలని కోరారు. ఈ సందర్భంగా చింతలపాడు వెళ్లిసింహాచలాన్ని కలిశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు.

➡️