పొన్నూరుపై ప్రతిష్టంభన

నూరి ఫాతిమాకు శుభాకాంక్షలు చెబుతున్న వైసిపి కార్పొరేటర్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై వైసిపి అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. గత నెల 2వ వారంలో ఉమ్మడి జిల్లాలో ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలకు జంబ్లింగ్‌ పద్ధతిలో మార్పులు చేశారు. దాదాపు 20 రోజుల తరువాత రెండో విడత జాబితాలను ప్రకటించారు. భారీగా మార్పులు ఉంటాయని రాజకీయ వర్గాలు ఊహించినా తాజాగా జాబితాలో గుంటూరు తూర్పు నుంచి ఎమ్మెల్యే ముస్తాఫా కూతురు నూరిఫాతిమాను ఖరారు చేశారు. ఇంకా పొన్నూరు, తెనాలి పెండింగ్‌లో ఉంచారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్‌ను కొనసాగించనున్నారని తెలిసింది. పొన్నూరుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎమ్మెల్యే కిలారి రోశయ్యను మారుస్తున్నట్టు ఇప్పటికే అధిష్టానం స్పష్టత ఇచ్చింది. వంగవీటి మోహన్‌ రంగా కుమార్తె పేరును పొన్నూరుకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వంగవీటి రాధా వైసిపిలోకి చేరితో ఆయన సోదరికి పొన్నూరు టిక్కెట్‌ ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట తప్ప మిగతా ఆరు నియోజకవర్గాలకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కొనసాగిస్తారా? మార్పులు చేస్తారా అనే అంశంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, నరసరావుపేట, వినుకొండ ఎమ్మెల్యేలలో ఇరువురికి మార్పు లేదా మొండి చేయి చూపడం ఖాయంగా చెబుతున్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి స్థానచలనం ఉండవచ్చునని తెలిసింది. మంత్రి అంబటి రాంబాబును తొలుత మరో స్థానానికి మార్చాలని ఆలోచించినా తాజాగా ఆయన్ను అక్కడే కొనసాగించనున్నట్టు తెలిసింది. పల్నాడు జిల్లాలో ఒక బిసికి అవకాశం కల్పించడానికి గురజాల, నరసరావుపేట ఎమ్మెల్యేలలో స్థాన చలనం ఉంటుందనే ప్రచారం ఉంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి పేరును పల్నాడు జిల్లాలో ఒక స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి నర్సరావుపేటకు రావాలని ప్రయత్నిస్తున్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కొంత మంది నాయకులు ఇప్పటికే అసమ్మతి ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరికి మార్పు తప్పదంటున్నారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో తెనాలి తప్ప ఆరుగురు ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. పార్టీలో కొత్త వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే పత్తిపాడు, గుంటూరు పశ్చిమ, తాడికొండ, మంగళగిరికి అభ్యర్థులను ప్రకటించారు. గురజాల నుంచి బిసికి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. నర్సరావుపేట, గురజాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తామే మళ్లీ తమ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించినా ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

➡️