పేరు పేదలది.. ప్రయోజనం పెద్దలది..

ప్రజాశక్తి – గరుగుబిల్లి : పేదల పేరు చెప్పి ఆ నిధులను పెద్దలకు అధికారుల కట్టబెట్టిన వైనం పార్వతీపురం ఐటిడిఎలో జరుగుతోంది. గిరిజన గ్రామాల అభివృద్ధి పేరిట మంజూరైన నిధులను అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఓ మైనింగ్‌ కంపెనీకి రోడ్డు వేయడమే ఇందుకు నిదర్శనం. తమ గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని గిరిజనులు, ప్రజాసంఘాలు వేడుకున్నా పట్టించుకోని పాలకులు, అధికారులు ఒకేసారి రూ.2కోట్లు రోడ్డు పనులకు నిధులు కేటాయించడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చినగుడబ రెవెన్యూ పరిధిలోని మైనింగ్‌ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి రోడ్డు వేసేందుకు రూ.2కోట్లుతో ప్రతిపాదనలు అధికారులు పంపడం పట్ల పలు ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ రోడ్డు వల్ల ఎవరికి ప్రయోజనమంటూ నిలదీస్తున్నాయి. ఇదే రోడ్డుకు మంజూరు చేసిన నిధులను కనీసం నడవడానికి అవకాశం లేని అనేక గిరిజన గ్రామాలున్నాయని, ఈ గ్రామాలకు ఇప్పటికీ వాహనాలు వెళ్లేందుకు మార్గాలు సరిగ్గా లేవని, అలాంటి గ్రామాలను విడిచిపెట్టి ఎవరి ప్రయోజనం కోసం మైనింగ్‌కంపెనీకి రోడ్డు వేసేందుకు నిధులు కేటాయిస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే పార్వతీపురం నుండి పాలకొండ వెళ్లే రహదారి గుంతలమయం కావడంతో వాహనదారులు నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నా పాలకులు పట్టించుకున్న పాపాన లేదు. అలాగే పార్వతీపురం నుంచి కొమరాడ వెళ్లే అంతర్‌రాష్ట్ర రహదారి గుంతలయమై అనేక మంది క్షతగాత్రులైనా పట్టించుకోలేని అధికారులు ఈ రహదారి పట్ల ఎందుకింత శ్రద్ధ చూపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైదాన ప్రాంత రోడ్లకు ఐటిడిఎ నిధులు కేటాయింపా?గిరిజన ప్రాంతంలో మౌలిక వసతులు కల్పనకు వినియోగించాల్సిన ఐటిడిఎ సబ్‌ ప్లాన్‌ నిధులను మైదాన ప్రాంతంలో కొంతమంది క్వారీ యజమానులకు ప్రయోజనం కలిగించేందుకు వినియోగించడమేమిటి? ప్రజా ప్రయోజనం కంటే వ్యాపారుల ప్రయోజనాలకే పాలకులు, అధికారులు సహకరిస్తున్నారు. క్వారీ యజమానులకు మేలు చేసేందుకు రూ.2కోట్లు కేటాయించడం దారుణం. మైదాన ప్రాంత రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌ నుంచి నిధులు కేటాయించాలి తప్ప ఐటిడిఎ నుంచి నిధులు కేటాయించడంలో ఆంతర్యమేమిటి.బివి రమణ,సిపిఎం నాయకులు.అభివృద్ధి ఇదేనా?ఐటిడిఎ నిధులు కేవలం గిరిజన సంక్షేమానికే ఖర్చు చేయాలి. గిరిజనేతరుల సంక్షేమం కోసం ఖర్చు చేయడం చట్ట విరుద్ధం. ఐటిడిఎ నిధులు దారిమళ్లిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు, జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులకు తెలియజేశాం. నిధుల మల్లింపు విషయంలో రాష్ట్ర గవర్నర్‌ స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.పి.రంజిత్‌కుమార్‌,గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర కన్వీనర్‌.

➡️