పెరిగిన మోసాలు.. తగ్గని దొంగతనాలు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : గతేడాది వివిధ రూపాల్లో మోసాలు పెరిగాయి. ముఖ్యంగా నిరుద్యోగాన్ని ఆసరా చేసుకుని ఉద్యోగాల పేరిట బురిడీ కొట్టించే కేసులు పెరిగాయి. దొంగతనాల సంఖ్య పెద్దగా తగ్గలేదు. ప్రమాదాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై పోక్సో కేసులు నమోదై నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. గంజాయి వినియోగం విచ్చలవిడిగా మారింది. హత్య, కిడ్నాపింగ్‌, గ్రీవియస్‌ హర్ట్‌, హత్యాయత్నం వంటి కేసులు గతేడాది కంటే తగ్గాయి. 2022లో హత్య కేసులు 23 నమోదు కాగా, 2023లో 16 కేసులు నమోదయ్యాయి. దీంతో, ఈ తరహా కేసులు 30 శాతం తగ్గినట్టు పోలీసులు చెబుతున్నారు. 2022లో కిడ్నాపింగ్‌ 66 కేసులు నమోదు కాగా, 2023లో 20 కేసులు నమోదయ్యాయి. 2022లో వరకట్న వేధింపుల వల్ల ముగ్గురు మరణించగా, గతేడాది కూడా ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వరకట్న వేధింపుల కేసులు 2022లో 319 నమోదుకాగా, 2023లో 270 కేసులు నమోదై, 15 శాతం తగ్గాయి. 2022లో రేప్‌ కేసులు 4 నమోదుకాగా, గతేడాది రెండు కేసులు నమోదయ్యాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించే కేసులు 2022లో 179 నమోదుకాగా, 2023లో 108 కేసులు వరకు నమోదయ్యాయి. పోక్సో కేసులు 2022లో 44 నమోదు చేయగా, 2023లో వాటి సంఖ్య 57కు పెరిగింది. ఇందులో 8 కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కంటే ఎక్కువగా జైలు శిక్షలు పడగా, 2 ఏళ్లకుపైగా మూడు కేసుల్లో జైలు శిక్షలు పడ్డాయి. 2023లో బందిపోటు దొంగతనం కేసు ఒకటి నమోదైంది. రోబరీ కేసులు 2022లో 4 నమోదుకాగా, 2023లో 3 కేసులు నమోదయ్యాయి. పగటిపూట దొంగతనం కేసులు 2022లో 28 నమోదు కాగా, 2023లో 19 కేసులు నమోదయ్యాయ. రాత్రిపూట దొంగతనాలు 2022లో 107, 2023లో 105 కేసులు నమోదయ్యాయి. సాధారాణ దొంగతనాలు 2022లో 343 నమోదు కాగా, 2023లో 335 కేసులు నమోదయ్యాయి. రహదారి ప్రమాదాల్లో 2022లో మృతులు 227 నమోదుకాగా, 2023లో 157 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారి కేసుల్లో 2022లో 510 నమోదు కాగా, గతేడాది 491 నమోదయ్యాయి. వైట్‌ కాలర్‌ నేరాలు గతేడాది స్వల్పంగా పెరిగాయి. 2022లో 82 కేసులు నమోదు కాగా, 2023లో ఆ సంఖ్య 117కు పెరిగింది. సైబరు నేరాల సంఖ్య 141 నుంచి 92కు తగ్గింది. 2022లో డిస్పోజ్‌ అయిన కేసుల్లో గతేడాది 3653 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి. 3445 ఐపిసి కేసుల్లోను, 208 స్పెషల్‌ అండ్‌ లోకల్‌ లా కేసుల్లో నిందితులకు 2023లో శిక్షలు ఖరారయ్యాయి. గంజాయి అక్రమ రవాణదారులపై కేసులు 2022లో 51 కేసులు నమోదు కాగా, గతేడాది 58 కేసులు నమోదు చేసి 2,558 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

➡️