పిల్లలు.. భవిష్యత్తు వెలుగులు

పిల్లలతో సెల్ఫీ తీసుకుంటున్న సిఎం జగన్‌

ప్రజాశక్తి – పాడేరు టౌన్‌, చింతపల్లి విలేకరులుపిల్లలు… భవిష్యత్తు వెలుగులని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. స్థితిమంతుల పిల్లలకు ధీటుగా పేదింటి పిల్లలను నిలపడమే తమ ధ్యేయమని ఉద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలోని చింతపల్లిలో గురువారం సిఎం లాంఛనంగా ప్రారంభించారు. వందలాది మంది పిల్లలు రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అదే క్రమంలో సిఎం పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని స్థానికంగా భారీగా ఏర్పాట్లు చేశారు. ట్యాబ్‌ల పంపిణీ సందర్భంగా సిఎం మాట్లాడుతూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ట్యాబుల పంపిణీ అంత ఆషామాషీ విషయం కాదన్నారు. రాష్ట్రంలో నాడు – నేడు పనుల ప్రగతిని వివరించారు. గిరిపుత్రుల స్వచ్చమైన మనసుల మధ్య, తనకు కొండంత అండగా నిలబడే అడవితల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఒక గొప్ప కార్యక్రమం చింతపల్లి వేదికగా తలపెట్టినట్టు తెలిపారు. పాడేరులో బ్రిడ్జిలు, రోడ్లు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సాలూరులో మొట్టమొదటసారిగా ట్రైబల్‌ యూనివర్సిటీ నిర్మాణం శరవేగంగా జరుగతోందన్నారు. పార్వతీపురం, నర్సీపట్నం, పాడేరులో మూడు మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయని తెలిపారు. ఐటిడిఎ పరిధిలో పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాలలో కూడా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️