పాలన వికేంద్రీకరణతో సత్ఫలితాలు

పరిపాలనకు సంబంధించిన వికేంద్రీకరణతో సత్ఫలితాలు సాధిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్‌

పరిపాలనకు సంబంధించిన వికేంద్రీకరణతో సత్ఫలితాలు సాధిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మండలంలోని రాగోలులో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన రాగోలు-1, 2 నూతన సచివాలయ భవనాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి పని చేయించుకోవాలంటే జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లి ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనయ్యేవారని, ఇప్పుడు అందుకు భిన్నంగా సచివాలయాల ఏర్పాటుతో ఉన్న ఊరిలోనే పని జరుగుతోందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో రూ.500 కోట్లతో 20 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను మోసం చేశారని ధ్వజెమత్తారు. చంద్రబాబు మాదిరిగా జగన్‌ ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత మరో మాట చెప్పలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఎన్నికైన మొదటి రోజు నుంచే అమలు చేశారని కొనియాడారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగులను వేధించేవారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. కొత్త వ్యవస్థను రూపకల్పన చేసేటప్పుడు అపోహలు సృష్టించే వాళ్లు ఉంటారని, అవి అపోహలు మాత్రమేనని గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి అంబటి నిర్మల, వైసిపి రైతు విభాగం జిల్లా అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, డిసిఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, వైసిపి మండల అధ్యక్షులు చిట్టి జనార్థనరావు, ఎఎంసి చైర్మన్‌ మూకళ్ల తాతబాబు, సర్పంచ్‌ గేదెల చెంగలరావు తదితరులు పాల్గొన్నారు.

➡️