పాల సేకరణ కేంద్రాలపై లైసెన్సు గుదిబండ

Mar 13,2024 21:25

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్‌ : అసలే అంతంత మాత్రం ఆదాయంతో నడుస్తున్న పాల సేకరణ కేంద్రాలపై లైసెన్సు గుదిబండ పడింది. వెన్నశాతం తనిఖీకి ఉపయోగించే అనలైజర్‌కు అనుమతిని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అనుమతి మంజూరు కోసం ఒక్కో కేంద్రం నిర్వాహకుని నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే పశుసంవర్థక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏటా లైసెన్సును పునరుద్ధరించుకోవాలని అందులో పేర్కొంది. పాలసేకరణ కేంద్రాలపై గుదిబండగా మారిన ఈ నిర్ణయంపై నిర్వాహకులు మండిపడుతున్నారు.పాలల్లో వెన్న శాతం లెక్కించే మిల్క్‌ అనలైజర్‌ యంత్రాలకు అనుమతి (లైసెన్సు) తీసుకోవాలని గ్రామాల్లోని పాలసేకరణ కేంద్రాల నిర్వాహకులకు పశుసంవర్థక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల అమల్లోకి వచ్చిన పాలచట్టం -2023ను అనుసరించి లైసెన్సు కోసం ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు రూ.వెయ్యి రుసుంగా చెల్లించాలని నిర్దేశించింది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ అధికారులు.. పాలసేకరణ కేంద్రాల నిర్వాహకులకు లిఖిత పూర్వకంగా నోటీసులు అందజేశారు. జిల్లాలో 769 పాలసేకరణ కేంద్రాలు ఉన్నాయి. అందులో 191 కేంద్రాల నిర్వాహకులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాల సేకరణ కేంద్రాల్లో పాలల్లో వెన్న శాతాన్ని బట్టి నిర్వాహకులు రైతులకు ధర చెల్లిస్తారు. ఈ పద్ధతి ఎన్నోఏళ్ల కాలం నుంచి కొనసాగుతోంది. వెన్న శాతం తక్కువగా నమోదైతే రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల కేంద్రాల్లో వినియోగించే మిల్క్‌ అనలైజర్లు సక్రమమైనవేనని పశు సంవర్థక శాఖ నిర్దారించాల్సి ఉంటుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనలైజర్‌ను నేరుగా పరిశీలించాకే సరైనదని ధృవీకరించి పత్రం జారీ చేస్తారు. ప్రతి ఏటా ఈ లైసెన్సు క్రమబద్ధీకరించుకోవడం తప్పనిసరి.నిర్వాహకుల విస్మయం ఎన్నో ఏళ్లుగా ఈకేంద్రాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు కొత్తగా లైసెన్సు విధానం ప్రవేశ పెట్టడంతో వారిలో ఆయోమయం నెలకొంది. కేంద్రం నిర్వహణ వల్ల పెద్దగా ఆదాయం లేకపోయినా లైసెన్సు ఫీజు కింద రూ.వెయ్యి తీసుకుంటున్నారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 769 కేంద్రాల ద్వారా రోజుకు సుమారు 4.50లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతోందని అంచనా. గ్రామాల్లో నిరుద్యోగ యువత, గృహిణులు స్వయం ఉపాధి కోసం స్వల్ప పెట్టుబడులతో నిర్వహిస్తున్న కేంద్రాలపై ఇప్పుడు లైసెన్సు పేరుతో ఒత్తిడి తేవడాన్ని వారు తప్పుపడుతున్నారు. జిల్లాలో 769 కేంద్రాల నుంచి ఏడాదికి రూ.7.69 లక్షల వరకు లైసెన్సు ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
రైతులకు మేలు
పాల చట్టం – 2023 ప్రకారం వెన్న శాతం కొలిచే పరికరాలకు లైసెన్సులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. పాలలో వెన్న శాతాన్ని కొలవడంలో నాణ్యత ఉంటుందని ప్రభుత్వ ఉద్దేశం. ఈ లైసెన్సులు పొందిన వారు కచ్చితమైన అనలైజర్లను మాత్రమే ఉపయోగిస్తారు. రైతులకు మంచి ధర చెల్లిస్తారు. – డాక్టరు కిశోర్‌, పశుసంవర్థక శాఖ జెడి

➡️