పార్వతీపురంలో ఐటిఐ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

Mar 28,2024 21:42

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో ఐటిఐ చదువుతున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రం లేకపోవడం అన్యాయమని వెంటనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పండు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం డిఆర్‌ఒ జి.కేశవనాయుడుకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రాన్ని అందించారు. అనంతరం పండు మాట్లాడుతూ ఐటిఐ పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్న సందర్భంలో పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట ప్రాంతాల్లో ఐటిఐ చదువుతున్న విద్యార్థులు రాజాం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనివల్ల విద్యార్థులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ విద్యాసంవత్సరంలో జులై చివరి వారంలో జరుగుతున్న పబ్లిక్‌ పరీక్షల నేపథ్యంలో పార్వతీపురం జిల్లా కేంద్రంలో గల జ్యోతి ఐటిఐ ( ప్రైవేట్‌ ) కళాశాలలో సుమారు 500 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు సరిపడా తరగతి గదులు, కంప్యూటర్లు, ల్యాబ్‌లు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయన్నారు. కావున అధికారులు ఆ కాలేజీని పరిశీలించి విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్థానిక జ్యోతి ఐటిఐ ( ప్రైవేట్‌ ) కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వినతిని అందజేసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు టి.అఖిల్‌, జిల్లా కమిటీ సభ్యులు పి.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️