పార్లమెంటు సభ్యుల సస్పెండ్‌ అప్రజాస్వామికం

Dec 23,2023 21:29

సమావేశంలో మాట్లాడుతున్న కన్వీనర్‌ అబులైస్‌

పార్లమెంటు సభ్యుల సస్పెండ్‌ అప్రజాస్వామికం
– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి – నంద్యాల
పార్లమెంట్‌ భద్రతపై హోం మంత్రి జవాబు ఇవ్వాలని కోరిన 146 మంది లోక్‌ సభ, రాజ్యసభ సభ్యులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం నంద్యాల పట్టణంలోని క్రాంతిరేఖ గ్రంథాలయంలో ప్రజాస్వామ్య లౌకిక ఐక్యవేదిక కన్వీనర్‌ ఎస్‌ఎండి అబులైస్‌, కో కన్వీనర్‌ పి.మస్తాన్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశంలో జమాతే ఇస్లామి అధ్యక్షులు ఎస్‌ .అబ్దుల్‌ సమద్‌, జమీయతుల్‌ వులేమా రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా ఖలీల్‌ అహ్మద్‌, ఉలేమా వల్‌ ఐమ్మ మౌలానా అబ్దుల్లా, బాంసెఫ్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ డాక్టర్‌ నిరంజన్‌, ఆవాజ్‌ జిల్లా కన్వీనర్‌ మస్తాన్‌ వలీ, ఇన్సాఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబా ఫకృద్దీన్‌, వెల్ఫేర్‌ పార్టీ అలీం, మౌలానా రహంతుల్లా, మునీర్‌, డాక్టర్‌ అంజద్‌, జబ్బార్‌, అబూబకర్‌, ఫిరోజ్షా సిద్దిఖి, ప్యాజ్‌ వాలే జాకీర్‌, కోహినూర్‌ మహబూబ్‌ బాషా తదితరులు పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం పార్లమెంటుకు, రాజ్యసభకు జవాబుదారీగా ఉండాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష ఎంపీల హక్కు అన్నారు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం అధికార పక్షం బాధ్యత అన్నారు. బిజెపికి చెందిన ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ పార్లమెంట్‌లో పొగ బాంబులు విసిరిన అగంతకులకు పార్లమెంట్లోకి పాస్‌లు ఇచ్చారని, ఈ ఎంపీని, ఏ అత్యున్నత సంస్థ పిలిపించి విచారించలేదన్నారు. 146 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్‌ ద్వారా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయిందన్నారు. విపక్ష ముక్త్‌ సభలో ఈ ప్రభుత్వం ఇష్టానుసారం ముఖ్యమైన బిల్లులను చర్చ లేకుండా మూజువాణి ఓటుతో పాస్‌ చేసుకుందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ప్రజాస్వామ్య లౌకిక వాదులు ఏకమై ఇవిఎంలు లేని పాత పద్ధతిలో ఎన్నికల ద్వారా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు.

➡️