పారిశుధ్య కార్మికుని కుటుంబానికి పరిహారమివ్వాలి

Mar 11,2024 21:32

ప్రజాశక్తి-పాలకొండ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన పారిశుధ్య కార్మికుడు మురళీకృష్ణ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నైతిక బాధ్యత వహించి నష్టపరిహారంతో పాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఇద్దరు బిడ్డలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మున్సిపల్‌ కార్మికులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటి యు) పాలకొండ నగర పంచాయతీ కమిటీ కార్యదర్శి సిహెచ్‌ సంజీవి, కోశాధికారి పి.వేణు, పి.మధు, చింతల రఘు, వండాన ఆంజనేయులు, బి విశ్వేశ్వరరావు, నాగవంశం సాయి తదితరులు పాల్గొన్నారు.

➡️