పాఠశాల కోసం ప్రయత్నం

Mar 28,2024 22:32

నార్త్‌ క్యాబిన్‌ పేటలో మూతబడిన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఎయిడెడ్‌ ఎలిమెంటరీ స్కూల్‌ భవనం
ప్రజాశక్తి – పొన్నూరు రూరల్‌ :
పొన్నూరు మున్సిపాల్టీ పరిధిలోని నిడుబ్రోలు క్యాబిన్‌పేటలోని రెండేళ్ల కిందట మూసేసిన ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలను పున:న్రపారంభించాలని స్థానికులు కోరుతున్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌ మెమోరియల్‌ ఎయిడెడ్‌ ఎలిమెంటరీ స్కూలు పేరుతో ఈ పాఠశాలను 1979లో అప్పటి మేనేజర్‌ కంచర్ల భాస్కరరావు ఏర్పాటు చేశారు. సుమారు 150 మంది 1-5 తరగతుల విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. ఈ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు పని చేయగా ఇక్కడ చదివిన ఎంతోమంది ఉన్నత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అయితే ఇద్దరు ఉపాధ్యాయులు రిటైర్‌ అవ్వగా వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. పైగా 2021-22 విద్యా సంవత్సరంలో ఇక్కడున్న ఏకైక ఉపాధ్యాయుణ్ణి మరొక పాఠశాలకు బదిలీ చేశారు. దీంతో అప్పటికే ఈ పాఠశాలలో 80 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. అయినా పాఠశాలను అర్ధాంతరంగా మూసివేయడంతో ఇక్కడి విద్యార్థులను కొండముది ఐదో వార్డు మున్సిపల్‌ ఎలిమెంటరీ స్కూలు, రైలుపేట ఆదికుమార్‌ మెమోరియల్‌ ఎలిమెంటరీ స్కూలుకు తరలించారు. అయితే చిన్నారులు ఆయా పాఠశాలలకు వెళ్లాలంటే రైలు పట్టాలను దాటి రావాల్సి వెళ్లడం, మరికొందరు దూరాబారం వెళ్లాల్సి రవడంతో కొంతమంది విద్యార్థులను తల్లిదండ్రులు చదువు మాన్పించారు. ఆవుల నాగేంద్రం కొడుకు ఇస్రాయిల్‌ రెండో తరగతి చదువుతున్న తన కుమారుడు ఆవుల ఇశ్రాయేలును దూరంలో ఉన్న పాఠశాలకు పంపించటం ఇష్టం లేక చదువు మాన్పించారు. ఇదే విధంగా మరికొందరు చేయగా ఆర్థిక స్తోమత ఉన్నవారు దగ్గర్లోని ప్రైవేటు స్కూళ్లలో చేర్పించారు. పేదరికంలో మగ్గుతున్న వారు తమ పిల్లల చదువులే మాన్పించారు. అయితే ఈ పరిస్థితిలో మార్పు కోసం స్థానికులు ప్రయత్నిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో తమ ప్రాంతంలోని పాఠశాలను పున:ప్రారంభించాలని, లేదా కొత్త పాఠశాలనైనా ప్రభుత్వం నిర్మించాలని కోరుతున్నారు. ఇందుకుగాను ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించాలని సిద్ధమవుతున్నారు.

➡️