పసుపు రైతులకు పరిహారమివ్వాలి-ఎపి రైతు సంఘం

Jan 29,2024 07:43 #Dharna, #raithu sangam

ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా):కోల్డ్‌ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు ప్రకృతి విపత్తుల నిధి నుండి పరిహారం ఇవ్వాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతుల సమావేశం టర్మరిక్‌ అసోసియేషన్‌ హాలులో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణయ్య, ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదం సంభవించి వేల బస్తాల పసుపు దగ్ధమైందని తెలిపారు. పసుపు పంట నష్టపోయిన రైతులకు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బీమా కంపెనీ నుండి వచ్చే నష్ట పరిహారం కోల్డ్‌ స్టోరేజ్‌ యజమాని ఖాతాలో కాకుండా బాధిత రైతుల ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కోల్డ్‌ స్టోరేజ్‌కు వచ్చే నష్ట పరిహారం కూడా రైతులకు పంచాలని, ఈ మేరకు చట్టపరంగానూ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బాధిత రైతులు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన అనంతరం తమను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలేమీ చేపట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామనే కలెక్టర్‌ హామీ కూడా నెరవేరలేదని తెలిపారు. ఈ సందర్భంగా 25 మందితో నష్ట పరిహార సాధన కమిటీ ఏర్పాటైంది. కన్వీనర్‌గా వేములపల్లి వెంకట్రామయ్య, కోాకన్వీనర్‌గా కాజ వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.

➡️