పలాసలో అభివృద్ధి శూన్యం

Mar 13,2024 21:28

ప్రజాశక్తి-పలాస : మంత్రి సీదిరి అప్పలరాజు దోచుకునేందుకే శ్రద్ధ చూపారే తప్ప పలాస అభివృద్ధి కోసం కృషి చేయలేదని ఎంపీ కింజరాపు రామ్మోహనాయుడు విమర్శించారు. కాశీబుగ్గ డెంకివీధిలో బుధవారం వైసిపి నుంచి సుమారు 100 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో తాగునీటికి ప్రజలు అల్లాడిపోతుంటే మంత్రి అప్పలరాజు పనితీరు ఏ స్థితిలో ఉందో అర్థమవుతోందని ఎద్దేవాచేశారు. రూ.700 కోట్లతో ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఎక్కడా చుక్కనీరు ఇచ్చే పరిస్థితులు లేవన్నారు. నియోజకవర్గంలో కొండల్ని సైతం దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే పలాస నియోజకవర్గం పరిధిలో సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషా మాట్లాడుతూ అప్పలరాజు మంత్రి పదవి చేపట్టాక అభివృద్ధి కన్నా సొంత ఆస్తులు పెంచుకున్నారని విమర్శించారు. అభివద్ధి చేశామని చెప్పుకుంటూ చుట్టూ తిప్పి కిడ్నీ ఆసుపత్రి ప్రారంభించారని, అందులో పూర్తిస్థాయిలో పరికరాలు, సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్ఞ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, గురిటి సూర్యనారాయణ, గాలి క్రిష్ణారావు, బడ్డ నాగరాజు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ వి.దుర్గారావు, బిజెపి నాయకులు పాలవలస వైకుంఠ రావు పాల్గొన్నారు. రైల్వే కాలిబాట వంతెన ప్రారంభంపలాస-నర్సిపురం రైల్వే కాలిబాట వంతెనను బుధవారం ఎమ్‌పి రామ్మోహన్‌ నాయుడు.. గౌతు శిరీషతో కలిసి ప్రారంభించారు. దీంతో నర్సిపురం గ్రామస్తులు రామ్మోహన్‌ నాయుడు, శిరీషను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్‌పి మాట్లాడుతూ కాలిబాట వంతెనను మూసేయడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతోందని శిరీషా చెప్పిన వెంటనే రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్కువ సమయంలో తెరిపించామని వివరించారు.

➡️