పర్యాటక కేంద్రంగా అంబేద్కర్‌ స్మృతివనం

Jan 17,2024 21:38

ప్రజాశక్తి-విజయనగరం  :  రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ స్వరాజ్‌ మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న భారతరత్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం, విగ్రహావిష్కరణకు జిల్లా ప్రజానీకం పెద్ద ఎత్తున తరలిరావాలని రాష్ట్ర షెడ్యూల్డు కులాల కమిషన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ కోరారు. జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం నగరానికి వచ్చిన ఆయన స్థానిక జిల్లాపరిషత్‌ అతిథిగహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో అన్ని రకాల వసతులతో విజయవాడ నడిబొడ్డున 20 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్‌ స్మతివనం గొప్ప పర్యాటక కేంద్రంగా రూపొంద బోతోందని పేర్కొన్నారు. ఈ స్మృతివనంలో 3 వేల మంది కూర్చొ నేందుకు వీలుగా మల్టీపర్పస్‌ కన్వెన్షన్‌ హాలు, 2 వేల మంది కూర్చొనేందుకు వీలుగా ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, 10 వేల పుస్తకాలతో భారీ గ్రంథాలయం వంటివి ఏర్పాటు కానున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అంబేద్కర్‌ విగ్రహం సమానత్వానికి, స్వేచ్ఛకు, విజ్ఞానానికి చిహ్నమని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రామానందం, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి సుధారాణి, డిఎస్‌పి గోవిందరావు, జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు బొంగ భానుమూర్తి, నగర కార్పొరేటర్‌ దాసరి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.ఛైర్మన్‌ ను కలసిన కలెక్టర్‌, ఎస్‌పిజిల్లా పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన ఎస్‌సి కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ను కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎస్‌పి దీపిక పాటిల్‌ స్థానిక జిల్లాపరిషత్‌ అతిథి గృహంలో కలిశారు. జిల్లాలో ఎస్‌సిల రక్షణ, వారి సంక్షేమానికి సంబంధించి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై వారు ఛైర్మన్‌తో చర్చించారు. ఎస్‌సిలు ఏదైనా సమస్యను విన్నవించుకోవడానికి అధికారుల వద్దకు వచ్చినపుడు సమస్యలను సావధానంగా ఆలకించాలని ఆయన సూచించారు. సందర్భంగా పలువరు దళిత సంఘాల ప్రతినిధులు ఎస్‌.సి. కమిషన్‌ ఛైర్మన్‌కు వినతిపత్రాలు అందజేశారు.దళితుల సమస్యలు పరిష్కరించాలి నెల్లిమర్ల : దళితుల సమస్యలు పరిష్కరించాలని దళిత సంఘం నాయకులు కె.శ్రీనివాసరావు, టి.నరసయ్య, చింతపల్లి దుర్గారావు కోరారు. జెడ్‌పి అతిధి గృహంలో రాష్ట్ర ఎస్‌సి కమిషన్‌ చైర్మన్‌ను కలిసి వినతి అందజేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ దళితులపై అన్యాయాలు, దాడులు పెరుగుతున్నా యన్నారు. అర్హతలుండి కూడా దళితులకు సంక్షేమ పథకాలలో మొండి చేయిచూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా దళితులు సాగుచేస్తున్న భూములకు హక్కులు కల్పించడంలో అధికారులు పక్షపాత ధోరణి చూపిస్తున్నారని , నెల్లిమర్ల మండలంలో పట్టాలు మంజూరు చేయడంలో కొన్ని వర్గాలకు అనుకూలంగా, కొందరికి ప్రతికూలంగా అధికార యంత్రాంగం పని చేస్తుందని తెలిపారు. ఎస్‌సి కమిషన్‌ చైర్మన్‌ దళితుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిశీలించి పరిష్కరించాలని ఫిర్యాదులో కోరారు.

➡️