పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

మార్చి ఒకటి నుంచి

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు

  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్‌, 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలు, టెట్‌, డిఎస్‌సి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. పది, ఇంటర్‌, టెట్‌, డిఎస్‌సి పరీక్షలపై తాడేపల్లిలోని విద్యాశాఖ కార్యాలయం నుంచి స్కూల్‌, ఇంటర్‌ ఎడ్యుకేషన్ల కమిషనర్లు సురేష్‌ కుమార్‌, సౌరభ్‌గౌర్‌, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌తో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముమ్మర తనిఖీల్లో భాగంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ సిద్ధం చేశామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుతో పాటు నిరంతర విద్యుత్‌, ఫ్యాన్లు, లైటింగ్‌ సక్రమంగా ఉండేలా కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్‌టిసి బస్సులను పలు రూట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌తో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాలను సెల్‌ఫోన్‌ ఫ్రీ జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో సిబ్బంది, విద్యార్థులు కేంధ్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లకుండా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో డిఇఒ వెంకటేశ్వరరావు, విద్యాశాఖ పరీక్షల సహాయ కమిషనర్‌ ఆలీఖాన్‌, ఆర్‌ఐఒ దుర్గారావు, డివిఇఒ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

➡️