పరీక్ష కేంద్రం వద్ద గుండెపోటుతో ఇన్విజిలేటర్‌ మృతి

Mar 23,2024 20:50

షాషావలి మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

పరీక్ష కేంద్రం వద్ద గుండెపోటుతో ఇన్విజిలేటర్‌ మృతి
– నివాళులర్పించిన ఎమ్మెల్యే కాటసాని
ప్రజాశక్తి – బనగానపల్లె
బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు షాషావలి (55) గుండెపోటుతో శనివారం మృతి చెందారు. ఉదయం పరీక్షా కేంద్రంలో ఉన్న ఇన్విజిలేటర్‌ షాషావలికి ఛాతిలో నొప్పి రావడంతో అనుమతి తీసుకుని బయటికి వచ్చారు. పరీక్ష కేంద్రం బయట కుప్పకూలిపోవడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన ఉపాధ్యాయుడు మండలంలోని యనకండ్ల గ్రామం మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్‌గా ఆయనకు డ్యూటీ వేశారు. ఉపాధ్యాయుడు షాషావలి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైసిపి అవుకు మండలం కన్వీనర్‌ కాటసాని తిరుపాల్‌ రెడ్డిలు అక్కడికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ షాషావలి తన చిన్ననాటి స్నేహితుడని, ఇద్దరం కలిసి ఒకే చోట చదువుకున్నామని చెప్పారు. తమకు ఎంతో ఆప్తుడైన షాషావలి మృతి చెందడం బాధాకరమన్నారు. షాషావలి కుటుంబానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్‌ రెడ్డి, నాయకులు నాయకులు అబ్దుల్‌ ఫైజ్‌, అబ్దుల్‌ ఖైజ్‌, ఎంపిటిసి అబ్దుల్‌ తాహేర్‌, వార్డ్‌ మెంబర్‌ కుమ్మరి సురేష్‌, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.షాషావలి మృతికి విద్యాశాఖ సంతాపం – ఉపాధ్యాయులు ఒత్తిడికి గురికావద్దు : డిఇఒనంద్యాల కలెక్టరేట్‌ : యనకండ్ల ప్రాధమికోన్నత పాఠశాల ఇంగ్లీష్‌ టీచర్‌ షాషావలి మృతికి జిల్లా విద్యాశాఖ తరపున డిఇఒ సుధాకర్‌ రెడ్డి సంతాపం తెలియజేశారు. షాషావలిని 10వ తరగతి పరీక్షలలో బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా నియమించామని, శుక్రవారం వరకు విధులను నిర్వహించారని డిఇఒ పేర్కొన్నారు. ఛీఫ్‌ సూపరింటెండెంట్‌ నివేదిక ప్రకారం షాషావలి శుక్రవారం రాత్రి నుండి అనారోగ్యంతో బాధపడుతు, శనివారం ఉదయం పరీక్షా విధులకు హాజరైనప్పటికీ ఆయనకు ఎలాంటి డ్యూటి అలాట్‌ చేయలేదని తెలిపారు. 9 గంటల సమయంలో అనుమతి అడిగి 9.05 నిముషాలకు ఇంటికి బైక్‌పై బయలు దేరారని, 11 గంటల సమయంలో సిఆర్‌పి దారా షాషావలి మృతి చెందినట్లు ఛీఫ్‌ సూపరింటెండెంట్‌కి తెలిపారన్నారు. షాషావలి కుటుంబానికి రావాల్సిన మట్టి ఖర్చులు తక్షణమే అందజేయాలని బనగానపల్లె ఎంఇఒను ఆదేశించారు. డ్యూటీ అలాట్‌ చేసిన ఉపాద్యాయులు ఎవరు ఒత్తిడికి గురి కావద్దని, ప్రతి పరీక్షా కేంద్రానికి అదనంగా ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

➡️