పరిష్కారం అయ్యే వరకూ పోరాటం

Jan 11,2024 23:16
తమ న్యాయమైన

ప్రజాశక్తి – యంత్రాంగం

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన అంగన్‌వాడీల సమ్మె గురువారం నాటికి 31వ రోజుకు చేరింది. జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద 24 గంటల రిలే నిరహారదీక్ష జరుగుతుండగా, మండల కేంద్రాల్లో రిలే నిరహారదీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా లెక్కచేయకుండా అంగన్‌వాడీలు ఉద్యమాన్ని కొనసాగి స్తున్నారు.

రాజమహేంద్రవరం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం అంగన్‌వాడీల 24 గంటల నిరహారదీక్షలో రాజానగరం ప్రాజెక్టు అంగన్‌వాడీలు కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శ బి.రాజులోవ, ఎపి ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి ఎం.వెంకటలక్ష్మి, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.బేబీ రాణి, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు అరుణకుమారి హాజరై మద్దతు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించమని స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు ఇచ్చిన వినతిపత్రాల పట్ల వైసిపి ప్రభుత్వం మొద్దు నిద్రను ప్రదర్శిస్తుందన్నారు. 31 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కర్కసంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తుగా నోటీసు ఇచ్చి సమ్మెలోకి దిగినా ప్రభుత్వం అంగన్‌ వాడీలను అత్యవసర సర్వీసుల పరిధిలోకి తీసుకొచ్చి ఎస్మా ప్రయోగించడం దారుణ మన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్‌ నాయకులు పోలిన.వెంకటేశ్వరరావు, యూనియన్‌ నాయకులు వై.సుజాత, ఎం. మార్తమ్మ, కె.సుజాత, టి.విజయ, కె.ఏడు కొండలు, జె.సునీతా, సరస్వతి, గంగ, విషాలి, చంద్ర, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

దేవరపల్లి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌ అన్నారు. స్థానికంగా జరుగుతున్న నిరసన శిబిరంలో అంగన్‌వాడీలు తాళ్లను మెడలకు బిగించుకుని మా సమస్యలు పరిష్కరించకపోతే తమకు ఆత్మహత్యలే చరణ్యమంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భగత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బాలింతలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తుందన్నారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించాల్సింది పోయి జటిలం చేసే పద్ధతులను ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.రత్నాజీ, యూనియన్‌ నాయకులు టిపి.లక్ష్మి, ఎ.పద్మ కామేశ్వరి, కె.వరలక్ష్మి, కె.దేవిసావిత్రి, కె.కుమారి, డివివి.లక్ష్మి, ఉండవల్లి మంగతాయారు, తదితరులు పాల్గొన్నారు.

నల్లజర్ల స్థానిక వ్యవసాయ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా నిరసించారు. అయితే అంగన్‌వాడీలకు మెమోలను అందించేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే మెమోలను అంగన్‌వాడీలు నిరాకరిస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ, ఆయాల ఇళ్లకు అంటించే కార్యక్రమాన్ని అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉడ్రాజవరపు మిస్సమ్మ, బేతాల నాగమణి, ఉడ్రాజవరపు జ్యోతి, శాంతివల్లి, తదితరులు నాయత్వం వహించారు.

చాగల్లు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల రిలే దీక్ష కొనసాగింది. నిరసన శిబిరాన్ని టిడిపి నాయయకులు ఆళ్ల హరిబాబు, కేతా సాహెబ్‌, జొన్నకూటి వెంకయ్యమ్మ, దొంగ రామకృష్ణ ఈడుపుగంటి మురళి, తాలూరి ప్రసాద్‌, మాజీ ఎంఎల్‌ఎ, జనసేన పార్టీ నాయకుడు టివి రామారావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మూడు నెలల తరువాత టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. నిరసన శిబిరంలో అంగన్‌వాడీ కార్యకర్త స్పహతప్పి పడిపోవడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. యూనియన్‌ నాయకులు పి.విజరుకుమారి, కె.లక్ష్మి, కె. దమయంతి, ఎ.శ్రీదేవి, బి.మహాలక్ష్మి, ఎస్‌.అరుణ్‌ కుమారి తదితరులు పాల్గొన్నారు.

గోకవరం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన శిబిరంలో రిలే నిరహారదీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన తరువాతే సమ్మెలోకి వచ్చామని అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌ తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎస్మావంటి చట్టాన్ని ప్రయోగించడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

పెరవలి స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన దీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్మా వద్దు…జీతాలు ముద్దు అంటూ అధికారులు అందచేస్తున్న మెమో నోటీసులను దహనం చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ నెల రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ కార్యదర్శి కె.కృష్ణవేణి బి.నాగవేణి, సెక్టార్‌ లీడర్స్‌ సిహెచ్‌. విజయ, వి.నిర్మల, కన్యాకుమారి, ఎస్‌.రాణి, తదితరులు పాల్గొన్నారు.

ఉండ్రాజవరం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన శిబిరంలో రిలే దీక్షలను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పెరవలి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు పాల్గొని మాట్లాడారు. ఎస్మా చట్టాన్ని రద్దు చేసేంతవరకూ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎస్‌.రంగనాయకమ్మ, ఎం.జానకి, పివిఎస్‌ఎస్‌.లక్ష్మి, విజయ కుమారి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️